hostel facility
-
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: నిజాం కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు కూడా హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన హాస్టల్ గదుల్లో సగం పీజీ చదివే విద్యార్థినులకు, మరో సగం డిగ్రీ చదివే విద్యార్థినులకు వసతి సదుపాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. నిజాం కాలేజీలో ఇప్పటి వరకూ డిగ్రీ చదివే బాలురకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. కాగా, తమకు కూడా హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థునులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కేటీఆర్.. విద్యా శాఖ మంత్రి సబితను కోరారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఉన్నతాధికారులతో చర్చించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 200 మందికి హాస్టల్ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల మెరిట్, వారి స్వస్థలానికి హైదరాబాద్‌కు ఉండే దూరాన్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థినుల ఆందోళనపై ప్రభుత్వం మానవతా కోణంలో స్పందించి, తక్షణ పరిష్కారం చూపిందని మంత్రి సబిత ట్వీట్ చేశారు. అయితే డిగ్రీ విద్యార్థుల కోసం అదనంగా మరో అంతస్తు నిర్మాణంపై అధికారికంగా సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా మంత్రిని కోరినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. అప్పటి వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం చెట్టుకిందే పాఠాలు విని.. అక్కడే భోజనాలు చేశారు. శనివారం కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. -
బువ్వపెట్టించండి సారూ..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్ఎం, డీఓటీ, డీఎంఎల్టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్ఎం, డీఎంఎల్టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని వినతి ఐటీడీఏ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి మెస్‌చార్జీలు ఇస్తేగానీ భోజనం పెట్టే పరిస్థితి లేదని విద్యార్థినులు వాపోతున్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హనుమంత్ కె జెండగేకు విన్నవించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు, బస్‌పాస్, పుస్తకాలు, యూనిఫాం, సరైన వసతులు కల్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. స్పందించిన పీఓ ఏపీఓ వసంతరావు ద్వారా హైదరాబాద్‌లోని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్లో మాట్లాడమని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా బిల్లులను అందించడానికి చర్యలు చేపడుతున్నామని, మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఓ వార్డెన్‌ను ఫోన్లో కోరారు. -
గ్రూప్స్ కోసం వసతి, స్టయిఫండ్‌తో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్‌ను సంప్రదించగలరు. -
మోడల్ స్కూళ్లలో... అతీగతీ లేని ‘వసతి’
– అక్టోబర్ 1 నుంచి వసతి గహాలు ప్రారంభమవుతాయన్న అధికారులు – ఈ విద్యా సంవత్సరం డౌటేనంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతన్నాయి. ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చిన మోడల్ స్కూళ్లలో వసతి సదుపాయం ఇప్పటికీ అతీగతీ లేకుండానే ఉంది. ఈ విద్యా సంవత్సరం కచ్చితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో.. అంటూనే వస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి వసతి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అక్టోబర్ 14 వస్తున్నా ఆ ఊసే పట్టించుకోలేదు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదీ నమ్మకం లేదని మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ మోడల్ స్కూళ్లలో ప్రవేశం కల్పించారు. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అధికారులు వసతి విషయంలో చేతులెత్తేశారు. దీంతో కొన్ని స్కూళ్లకు రోజూ వచ్చి వెళ్లలేని కొందరు విద్యార్థులు టీసీలు తీసుకెళ్లి వేరే స్కూళ్లలో చదువుకుంటున్నారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు అద్దె ఆటోలను మాట్లాడుకుని రోజూ వచ్చి వెళ్తున్నారు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు 19 స్కూళ్లలో హాస్టల్ వసతి కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. నాలుగు నెలల్లో నాలుగైదుసార్లు తేదీలు మార్చారు. మోడల్‌స్కూళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ‘మూడడుగులు ముందుకు.. ఆర డుగులు వెనక్కు’ అన్న చందంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మోడల్’ చదువు ప్రశ్నార్థకంగా మారింది. ..................................... రాష్ట్రమంతా ఇదే పరిస్థితి అక్టోబర్ 1 నుంచి జిల్లాలో 19 స్కూళ్లలో వసతి గహాలను ప్రారంభించాలనుకున్నాం. అయితే నీటి సదుపాయం, కరెంటు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మా పరిధిలో లేవు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాతే హాస్టళ్లు ప్రారంభమవుతాయి. – అంజయ్య, డీఈఓ