మోడల్ స్కూళ్లలో... అతీగతీ లేని ‘వసతి’
– అక్టోబర్ 1 నుంచి వసతి గహాలు ప్రారంభమవుతాయన్న అధికారులు
– ఈ విద్యా సంవత్సరం డౌటేనంటున్న ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యలతో సతమతమవుతన్నాయి. ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చిన మోడల్ స్కూళ్లలో వసతి సదుపాయం ఇప్పటికీ అతీగతీ లేకుండానే ఉంది. ఈ విద్యా సంవత్సరం కచ్చితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో.. అంటూనే వస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి వసతి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ అక్టోబర్ 14 వస్తున్నా ఆ ఊసే పట్టించుకోలేదు.
పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదీ నమ్మకం లేదని మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ మోడల్ స్కూళ్లలో ప్రవేశం కల్పించారు. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అధికారులు వసతి విషయంలో చేతులెత్తేశారు. దీంతో కొన్ని స్కూళ్లకు రోజూ వచ్చి వెళ్లలేని కొందరు విద్యార్థులు టీసీలు తీసుకెళ్లి వేరే స్కూళ్లలో చదువుకుంటున్నారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు అద్దె ఆటోలను మాట్లాడుకుని రోజూ వచ్చి వెళ్తున్నారు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు 19 స్కూళ్లలో హాస్టల్ వసతి కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. నాలుగు నెలల్లో నాలుగైదుసార్లు తేదీలు మార్చారు. మోడల్‌స్కూళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ‘మూడడుగులు ముందుకు.. ఆర డుగులు వెనక్కు’ అన్న చందంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మోడల్’ చదువు ప్రశ్నార్థకంగా మారింది.
.....................................
రాష్ట్రమంతా ఇదే పరిస్థితి
అక్టోబర్ 1 నుంచి జిల్లాలో 19 స్కూళ్లలో వసతి గహాలను ప్రారంభించాలనుకున్నాం. అయితే నీటి సదుపాయం, కరెంటు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మా పరిధిలో లేవు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాతే హాస్టళ్లు ప్రారంభమవుతాయి.
– అంజయ్య, డీఈఓ