వెంటనే హాస్టల్స్ తెరవాలి : ఎస్ఎఫ్ఐ
లేనిపక్షంలో ఉద్యమం తప్పదు
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సురేష్
విజయనగరం: జిల్లాలో మూసివేసిన వసతిగృహాలను వెంటనే తెరిపించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్ హెచ్చరించారు. హాస్టల్స్ మూసివేతకు నిరసనగా బుధవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నీరుగార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వసతిగృహాలను ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్య అందించడమే తన ధ్యేయమని చెప్పుకునే ముఖ్యమంత్రి వసతిగృహాలను ఎందుకు మూరుుంచివేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఇప్పటికే 23 ఎస్సీ విద్యార్థుల వసతిగృహాలు మూసివేశారని చెప్పారు.
ఈ ఏడాది విలీనం పేరుతో జిల్లా వ్యాప్తంగా 13 బీసీ విద్యార్థుల వసతిగృహాలను మూసివేయడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హాస్టల్స్ విలీనంలో తన నిర్ణయూన్ని ఉపసంహరించుకోవడంతో పాటు మూసివేసిన హాస్టల్స్‌ను వెంటనే తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బి.లక్ష్మణరావు, ఎస్.వెంకటరమణ, సీహెచ్.లక్ష్మణ, పి.వాసు, ఎం.కార్తీక్, టి.మధు, డి.రాజేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.