hot debate
-
'వారితోనే మేం ఉద్యమించింది.. ఎలా విస్మరిస్తాం..'
హైదరాబాద్: నిరుద్యోగ సమస్య ప్రతిపక్షానిది కాదని, అధికార పక్షానిదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారంత ప్రత్యేక రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమాలు చేసినవారేనని, వారి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వంపరంగా తమపై ఎక్కువగా బాధ్యత ఉందని చెప్పారు. వారిని వెంటేసుకునే ఉద్యమంలో ముందుకు వెళ్లామని ఈటెల చెప్పారు. ప్రతిపక్షం సమస్యల నుంచి లబ్ది పొందాలని ఆశించొద్దని హితవు పలికారు. ఇప్పటి వరకు 11 వేల ఉద్యోగాలు నింపామని, 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, డీఎస్సీ ద్వారా 10 వేలకు పైగా పోస్టులు త్వరలో వేస్తున్నామని ఇలా మొత్తం ఇప్పటికే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని ఆయన సభకు చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 25,589 మంది ఉన్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వంపై అదనంగా 310కోట్ల భారం పడుతుందని వెల్లడించారు. -
'ఏటి మల్లన్న.. బోడి మల్లన్న అన్నట్లుంది'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై వాడి వేడి చర్చ జరిగింది. బీజేపీ నేత కే లక్ష్మణ్ ఈ సమస్యపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరు ఏరు దాటిందాక ఏటి మల్లన్న ఏరు దాటినంక బోడిమల్లన్న అన్న తీరుగా ఉందని అన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హేతుబద్దీకరణ పేరిట ఉన్న ఉద్యోగాలు లేకుండా చేసి ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోయేలా చేస్తున్నారే తప్ప ఆ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచి తిరిగి ఉపాధ్యాయ పోస్టులు నింపాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలేమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన మీరు అందులో ఎన్ని భర్తీ చేస్తున్నారో ఎప్పుడు భర్తీ చేస్తారో స్పష్టం చేయలేదన్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ, జేఎల్, డీఎల్, గ్రూప్స్ పై స్పష్టతనివ్వలేదని మండిపడ్డారు.