దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.98.56 లక్షలు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) దుర్గమ్మ హుండీలో రద్దయిన పెద్ద నోట్లు భారీగానే వచ్చి చేరాయి...రెండు రోజులుగా జరుగుతున్న హుండీల లెక్కింపులో దాదాపు రూ.1.08 కోట్ల మేర రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల రూపంలో వచ్చినవే..దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను రెండో రోజైన గురువారం కూడా కొనసాగింది. మహా మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రెండో రోజు 12 హుండీల ద్వారా రూ.98,56,970 నగదు లభ్యమైంది. రెండో రోజులలో అమ్మవారికి రూ.2,89,31,754 నగదు కానుకల రూపంలో లభ్యమయ్యాయి.
రద్దయిన పెద్ద నోట్లే అధికం....
అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలలో అధిక మొత్తంలో రద్దయిన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల రూపంలో లభ్యమయినవే. మొదటి రోజున రూ.500 నోట్లు 11,255, రూ. 1000 నోట్లు 2258 లభ్యమయ్యాయి. ఇక రెండో రోజున రూ.500 నోట్లు 4468, రూ.1000 నోట్లు 683 లభ్యమయ్యాయి. రూ.500 నోట్ల రూపంలో రూ.78,61,500, రూ.వెయ్యి నోట్ల రూపంలో రూ. 29.41 లక్షలు లభ్యం కావడంతో దాదాపు రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది.
వెండి ఎక్కువగానే....
దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన వెండి కూడా ఈదఫా రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు 6.040 కిలోలు లభ్యం కాగా గురువారం 10.820 కిలోల వెండి వస్తువుల రూపంలో లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. హుండీల ఒకేసారి 16కిలోలకు పైగా వెండి లభ్యం కావడం ఇదే ప్రథమంగా తెలుస్తుంది. ఇక బంగారం 565, రెండో రోజున 820 లభ్యమైంది.