House Crop
-
ఇంటిపంటలే ఆరోగ్యదాయకం
హైదరాబాద్ కుషాయగూడలో లత, కృష్ణమూర్తి వృద్ధ దంపతులు రెండేళ్ల నుంచి తాము నివాసం ఉంటున్న బంధువుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరైన తర్వాత కుషాయగూడలోని బావ గారి ఇంటి మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలను కలుషిత జలాలతో పండిస్తున్నారన్న వార్తలు చదివిన తర్వాత తమ ఆరోగ్యం కోసం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలని నిర్ణయించుకున్నామని లత కృష్ణమూర్తి తెలిపారు. బరువు తక్కువగా ఉంటుందని గ్రోబాగ్స్‌లోనే ఎక్కువ భాగం ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారి మిద్దెపై 300–400 గ్రోబాగ్స్‌లో పచ్చని పంటలు పండుతున్నాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్ల మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బోరు లేదు. నీటి అవసరాలకు కుళాయి నీరే ఆధారం కాబట్టి డ్రిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రోబాగ్స్‌లో కొయ్య తోటకూర, మెంతికూర, చుక్క కూరలతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టానని లత తెలిపారు. మొదట్లో చాలా సమస్యలు వచ్చినా అనుభవం నుంచి నేర్చుకున్నారు. చౌహన్ క్యు, పాలేకర్ బాటలో... ఎర్రమట్టి 20 శాతం, కొబ్బరిపొట్టు 25 శాతం, 55 శాతం పశువుల ఎరువు+వర్మీకంపోస్టుతోపాటు గుప్పెడు వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని గ్రోబాగ్స్‌లో నింపి ఇంటిపంటలను దిగ్విజయంగా సాగు చేస్తున్నారు లత కృష్ణమూర్తి. సౌత్ కొరియా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహన్‌క్యు చూపిన బాటలో ఇంటిలో లభించే ముడి సరుకులతోనే పోషకద్రావణాలను తయారు చేసుకొని పంటలకు ప్రతి వారం, పది రోజులకోసారి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారామె. జీవామృతం స్వయంగా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తున్నారు. మునగాకు లేదా వేపాకు బరువుతో సమానంగా బెల్లం కలిపి 20 రోజుల తర్వాత లీటరుకు 1–2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం, మట్టిలో పోయడం ద్వారా అధిక దిగుబడి పొందుతున్నామని, చీడపీడల బెడద లేకుండా చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండుతున్నాయని లత సంతృప్తిగా చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి గత వారం వరకు అసలు కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తమకు ఇంటిపంటలే సరిపోయాయని ఆమె తెలిపారు. అందరూ ఇంటిపంటలు పండించాలి కలుషితనీరు, విషరసాయనాలతో పండించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు బదులు నగరవాసులు అందరూ తమ ఇళ్లమీద పండించుకోవడం మంచిది. వారానికి కనీసం 3–4 రోజులైనా తాము పండించిన సేంద్రియ, తాజా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌కు వెళ్లేబదులు ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ఇంటిపంటల్లో పనులు చేసుకుంటే మేలు. ఇంటిపంటల పనుల్లో నిమగ్నం అయితే టైం కూడా తెలవదు. మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేము మంచి ఆహారం తీసుకోవడంతోపాటు విదేశాల్లో ఉన్న మా పిల్లలకు కూడా పొన్నగంటి కూర వంటి ముఖ్యమైన ఆకుకూరలను నీడలో ఆరబెట్టి పంపుతున్నందుకు ఆనందంగా ఉంది. – లత కృష్ణమూర్తి, ఇంటిపంటల సాగుదారు, కుషాయగూడ, హైదరాబాద్ కాకర కాయను చూపుతున్న లత కృష్ణమూర్తి లత కృష్ణమూర్తి మిద్దెతోటలో పండిన కూరగాయలు -
ఇంటి కంపోస్టు.. సొంత కూరగాయలు!
హైదరాబాద్ నగరంలో పుట్టిపెరిగిన ఈమని వెంకటకృష్ణ మెహదీపట్నం కాంతినగర్ కాలనీలోని తమ సొంత ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఇంటిల్లి పాదీ ఆరోగ్యంగా ఉన్నారు. వెంకటకృష్ణ బీటెక్ అనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి బహుళజాతి కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఫ్రీలాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. 7గురు పెద్దలు, ఇద్దరు పిల్లలున్న ఉమ్మడి కుటుంబం వారిది. 1500 ఎస్.ఎఫ్.టి. టెర్రస్‌పై 200 పైచిలుకు టబ్‌లు, గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు పండిస్తున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలు కొనలేదు. 200 లీటర్ల ప్లాస్టిక్ పీపాలను కొనుగోలు చేసి మధ్యకు కత్తిరించిన వందకుపైగా టబ్‌లు.. అడుగు ఎత్తు–2 అడుగుల వెడల్పు ఉండే వాష్ టబ్స్.. అడుగు ఎత్తుండే గ్రోబాగ్స్ వాడుతున్నారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు అలములతో సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టునే ఉపయోగిస్తున్నారు. ఏ టబ్‌లోనైనా.. కొబ్బరి పీచు+చెరకు గడల వ్యర్థాలను అడుగున 20% ఎత్తు మేరకు వేసి.. ఆ పైన 30% ఎర్రమట్టి వేసి.. ఆ పైన సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును 30% మేరకు వేస్తారు. తర్వాత అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా కంపోస్టు వేసుకుంటూ.. ఇంటిపంటలు పోషకాల లోపం, చీడపీడలకు గురికాకుండా మంచి ఉత్పాదకతను సాధిస్తున్నారు. తోటకూర, పాలకూర, పొన్నగంటి, బచ్చలి, గోంగూరలతోపాటు వంగ, బీర, నేతిబీర, చిక్కుడు, గోరుచిక్కుడు, పిచ్చుకపొట్ల, పచ్చిమిరప, కంద.. సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారానికి 3 రోజులపాటు ఇంటి కూరగాయలనే తింటున్నారు. త్వరలో వారానికి 5 రోజులు సరిపోయే అంతగా ఇంటిపంటల సాంద్రతను పెంచామని అంటూ.. నూటికి నూరు శాతం వీటికే పరిమితం కావడం సాధ్యం కాదని వెంకటకృష్ణ(90001 03046) అభిప్రాయపడుతున్నారు. చెత్తను బయటపడేయకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ.. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను ఇంటిపైనే పండించుకుంటున్న వెంకటకృష్ణ కుటుంబానికి జేజేలు! వెంకటకృష్ణ -
పాత దుపట్టాతో పండు ఈగకు చెక్!
ఇంటి పంటలను ఆశించే చీడపీడల్లో కొన్ని వాటంతటవే తగ్గుముఖం పడతాయి. మరికొన్నింటిని వేపనూనె వంటి వృక్ష సంబంధ క్రిమినాశనులను, కషాయాలను పిచికారీ చేసి అదుపులో ఉంచవచ్చు. కానీ కొన్ని మొండి జాతి పురుగుల నిర్మూలన మాత్రం ఒక పట్టాన సాధ్యం కాదు. ఇటువంటి వాటిలో ముఖ్యమైనది పండు ఈగ (ఫ్రూట్‌ఫ్లై) . దీనివల్ల ఇంటిపంటల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ఆశించిన పండ్లు, కాయలు లోపలే కుళ్లి చెట్టు నుంచి రాలిపోతాయి. ఉద్యాన పంటల్లో దీన్ని నిర్మూలించేందుకు ఫిరమోన్ అనే రసాయనాన్ని వాడతారు. కానీ ఇంటిపంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల రసాయనాల పిచికారీ సాధ్యం కాదు. అయితే పాత దుపట్టా సంచితో పండు ఈగకు చెక్ చెప్పవచ్చంటున్నారు సీనియర్ ఇంటిపంటల పెంపకందారు వనమామళి నళిని (nalinivmw@gmail.com). హైదరాబాద్ మెహదీపట్నంలోని తమ మేడపై గత ఐదేళ్ల నుంచి వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలను సాగు చేస్తున్నారు. పాత దుపట్టాను కత్తిరించి కుట్టిన చిన్న సంచిలో కాయలను చేర్చి మూతి కడితే చాలు.. పండీగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చుంటున్నారు. ఈ కవచాన్ని ఛేదించి పండు ఈగ కాయలను ఆశించలేదని నళిని చెపుతున్నారు. ఆలోచన బాగుంది.. కదా మరి ఆచరిద్దామా? దుపట్టా సంచుల తయారీ ఇలా... 1. దుపట్టా సంచిని కట్టిన పండ్లు.. 2. పాత దుపట్టాను సంచుల తయారీలో వాడాలి. 3. సంచిలో ఉంచే కాయల సంఖ్య, పరిమాణాన్ని బట్టి సరిపడా సైజులో దుపట్టాను కత్తిరించుకొని కుట్లు వేసుకోవాలి. దుపట్టాను మూడువైపులా మూసి ఒక వైపు తెరచి ఉండేలా దారంతో కుట్టుకోవాలి. 4. కాయల సంఖ్యను బట్టి అవసరమైనన్ని సంచులను తయారు చేసుకోవాలి. 5. సంచి మూతి వైపు ఒక బొందును కలిపి కుట్టాలి 6. దుపట్టా సంచులు సిద్ధం 7. కాయలు సంచిలోకి వచ్చేలా మూతిని బొందుతో బిగించి కట్టాలి. ఇంటిపంటల రక్షణలో కాంతిరేఖ లైట్ ట్రాప్‌ను వాడి చీడపీడల బారి నుంచి ఇంటి పంటలను కాపాడుకుంటున్నారు హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన వనమామళి నళిని. వినూత్న పద్ధతులను అవలంభించి ఇంటిపంటలను సాగు చేయటంలో ఆవిడది అందెవేసిన చేయి. ఇటీవలే చీడపీడలను నివారించేందుకు ఆమె రూపొందించిన లైట్ట్రాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించి మంచి ఫలితాలు రాబట్టారు. వివిధ రకాల రసం పీల్చే పురుగులను దీని ద్వారా సులభంగా అరికట్టవచ్చు. దీనికోసం ముందుగా బకెట్ లేదా వెడల్పాటి పాత్రను సబ్బునీటితో నింపుకోవాలి. మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ బల్బ్‌ను బకెట్పైన ఏర్పాటు చే సి కనెక్షన్ ఇవ్వాలి. ఈ బకెట్‌ను ఇంటిపంటల్లో మొక్కల మధ్య ఉంచి పొద్దుగుంకేముందు లైట్‌ను ఆన్ చేయాలి. లైట్ రాత్రిమొత్తం వెలుగుతూనే ఉండాలి. ఇంటిపంటలను ఆశించిన పురుగులను ఈ వెలుతురు ఆకర్షిస్తుంది. లైట్ దగ్గరకు వచ్చిన పురుగులు బకెట్‌లోని సబ్బునీళ్లలో పడి చనిపోతాయి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వీటి సంఖ్య తగ్గి ఇంటిపంటలకు ఎలాంటి హాని ఉండదని న ళిని చెపుతున్నారు. -
ముంబై డాబాలపై సామూహిక ఇంటిపంటలు!
నగరాల్లో విస్తరిస్తున్న ఇంటిపంటల సంస్కృతి కొత్త పోకడలను సంతరించుకుంటోంది. ఇంటి పంటల సాగులో ముంబైవాసులు మరో అడుగు ముందుకేశారు. ఎవరింటిపై వారే సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసే ధోరణికి భిన్నంగా.. ముంబై వాసులు తోటి వారితో కలిసి సామూహిక ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ముంబైలోని అర్బన్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, సేవా సంస్థల భవనాలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొందరు ఔత్సాహికులు మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్ భవనంపై గత రెండేళ్లుగా సామూహికంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు, ఔషధ మూలికలను సాగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సామూహిక ఇంటిపంటల క్షేత్రాల్లో అందరూ కూడి పనులు చేస్తారు. పిల్లలు, పెద్దలు వారాంతపు సెలవును ప్రకృతితో మమేకం అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో ఇంటిపంటలకు అవసరమైన సేంద్రియ ఎరువు అమృత్‌మట్టిని భవనాలపైన మడుల్లోనే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత అదే మడుల్లో నవధాన్యాలతో పచ్చిరొట్ట పెంచి.. మొక్కలను కత్తిరించి తిరిగి మట్టిలో కలిపేస్తారు. తదనంతరం పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చెరకు పిప్పిని విరివిగా వినియోగిస్తారు. ఇటుకలను అందమైన వివిధ ఆకృతుల్లో పేర్చి సమృద్ధంగా ఇంటిపంటలు పండిస్తారు. కేవలం కూరగాయలు, పండ్ల సాగు కోసమే కాక.. సామూహిక ఇంటిపంటలు పక్షులకూ ఆవాసాన్ని కల్పిస్తుండటం విశేషం. సామూహిక ఇంటిపంటల సాగు ద్వారా రసాయన రహిత ఆహారాన్ని పండిస్తున్న అర్బన్ లీవ్స్ ఇండియా బృందం ముంబైని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది.