సర్వే కోసం శిథిల గృహంలో..
పరిగి: సమగ్ర కుటుంబ సర్వే అనగానే ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. స్వగ్రామంలో సొంత ఇల్లున్నా ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని వెళ్లినవారు కొందరైతే.. ఉన్న ఇళ్లు శిథిలమై తిరిగి కట్టుకోలేని దీన స్థితిలో పట్టణాలకు వలస వెళ్లినవారు మరికొందరు ఉన్నారు. సర్వే పుణ్యమా అని ఊరికి వచ్చిన ఓ కుటుంబం శిథిలమైన ఇళ్లలోనే కూర్చుండి కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మాదారానికి చెందిన ఎం.డి.యూసుఫ్, యూనూస్, ఖాసీం సోదరులు. వీరంతా ఉమ్మడి కుటుంబంగా కలిసుండేవారు. ఏళ్ల క్రి తం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. దీంతో అన్నదమ్ములంతా ఎవరికి వారు వేరే గ్రామాలకు వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కూలిపోయి మిగిలిన నాలుగు గోడల మధ్యే సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వంఇల్లు మంజూరు చేయాలని కోరారు.