House structures
-
డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని ధర్నా
చిన్నకోడూరు(సిద్దిపేట) : తమకు జీవనాధారమైన భూములు లాక్కుని.. ఇతరులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించవద్దని నిర్వాసితులు ధర్నాకు దిగిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి చెలుకపల్లి మధిర ఎల్లాయపల్లిలో జరిగింది. నిర్వాసితులు భూములలో టెంట్ వేసుకుని ధర్నాకు దిగారన్న విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నం చేసారు. దీంతో నిర్వాసితురాలు పల్మారు భూలక్ష్మి(62) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను తమ వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆందోళనకారుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
పరిహారం కోసం అడ్డదారులు..
పుట్టుకొస్తున్న కొత్త ఇళ్లు పరిహారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. అధికారుల అండదండలతో పరిహారం కోసం కొత్త ఇళ్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఒకే ముంపు గ్రామంలో వందకుపైగా కొత్త ఇళ్ల నిర్మాణం చూసి స్పెషల్ కలెక్టర్ కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామంలో ఎక్కడా ఖాళీ స్థలాలు కనపడటం లేదు. ఆర్అండ్బీ, పంచాయతీ స్థలాలు, శ్మశానాలు, ఏదీ వదలకుండా ఎక్కడపడితే అక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కాని వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. కారణం ఏంటంటే ఈ గ్రామం జల్లేరు ముంపులో ఉంది. నెల రోజుల క్రితం ఈ గ్రామం జల్లేరు రిజర్వాయర్ ముంపులో ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకేముంది అంకంపాలెంలో పరిహారం కోసం పుట్టగొడుగుల్లా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలం కనపడితే చాలు పేక మేడల్లా ఇళ్లు, షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, భారీ కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు. ముంపులో ఉన్న ఇళ్లకు మూడు నుంచి నాలుగు రెట్ల వరకు పరిహారం వస్తుందనే కారణంతో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. దీనికి పంచాయతీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో పునాది వేయగానే ఇంటి పన్ను వచ్చేస్తోంది. పంచాయతీ అధికారులకు రూ. పది వేలు సమర్పించుకుంటే మూడు సంవత్సరాల పాత తేదీలతో ఇంటి పన్నులు, కుళాయి కనెక్షన్లు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అంకంపాలెంలో జరుగుతున్న ముంపు సర్వే పనులను పరిశీలించేందుకు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. అయన వచ్చే సరికి సర్వే బృందం కనపడకపోవడంతో గ్రామం అంతా కలియతిరిగారు. గ్రామంలో కొత్తగా పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం కట్టిన ఇళ్లను తప్ప ఇప్పుడు కడుతున్న కొత్త ఇళ్లకు సర్వే చేస్తే ఉద్యోగాలు ఊడతాయని సర్వే సిబ్బందిని హెచ్చరించారు. -
అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు
అనంతపురం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అథితి గృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014కు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.70 వేలు ఉండేదన్నారు. ఆ మొత్తం సరిపోక 2 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి లబ్ధిదారులకు అదనంగా రూ.25 వేలు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన జీఓ 64ను విడుదల చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని 27,197 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్లు నిర్మించుకునే వారికి యూనిట్‌కు రూ.1.50 లక్ష మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీ, హౌసింగ్ ఇన్చార్జ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
అడిగే వారెవరు? అడ్డంగా కట్టేదాం!
►వాణిజ్య సముదాయాలు, భవన నిర్మాణాల్లో ఇష్టారాజ్యం ►సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు ►పట్టించుకోని పట్టణ ప్రణాళిక విభాగం ►బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేక కొరవడిన పర్యవేక్షణ ‘పట్టణ ప్రణాళిక’ గాడి తప్పింది. అడ్డగోలు నిర్మాణాలతో కర్నూలు నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలను కాలరాసి, ఇష్టమొచ్చినట్లు భవనాలు నిర్మిస్తున్నా అడిగే నాథులే కరువయ్యారు. పర్యవేక్షణ అధికారుల కొరత, సిబ్బంది చేతివాటం కారణంగా భవన యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు (టౌన్) : నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 5.50 లక్షల జనాభా ఉంది. 1.30 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాణిజ్య సముదాయాలు, భవన, ఇళ్ల నిర్మాణాలు భారీసంఖ్యలోనే చేపడుతున్నారు. చాలా వరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయినా ప్రశ్నించే వారు లేరు. నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో 51 వార్డులకు గాను ఏడుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. వీరంతా ప్రతిరోజూ ఉదయం నుంచే కాలనీలలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించాలి. అనుమతులు తీసుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపడుతున్నారా, లేదా అన్నది తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమాన విధించడం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే.. ఇక్కడ అలాంటి ఊసే లేదు. ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టరూ లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. సిటీ ప్లానర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. డిప్యూటీ సిటీప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ –2, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు ముగ్గురు, ఒక టౌన్ ప్లానింగ్ ట్రేసర్, సర్వేయర్, ఆరుగురు చైన్మన్లు పనిచేస్తున్నారు. వీరందరి కంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లే కీలకం. ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో భవన నిర్మాణదారుల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నారు. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు అడ్డగోలు నిర్మాణాల వద్ద హడావుడి చేసి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనే అక్రమ నిర్మాణాలు ఎక్కువగా సాగుతున్నాయి. గాంధీనగర్, విద్యానగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం విద్యానగర్‌లో ఓ ఇంటి నిర్మాణానికి నగరపాలక పట్టణ ప్ర«ణాళిక విభాగం నుంచి అనుమతి తీసుకున్న వ్యక్తి ఇంటితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే..దీనిపై వివాదం తలెత్తడంతో నిర్మాణానికి బ్రేక్ పడింది. ► అబ్ధుల్లా ఖాన్ ఎస్టేట్‌లో అయ్యప్పస్వామి గుడి ఎదురుగా వాణిజ్య పరమైన నిర్మాణం చేపడుతున్నారు. డీవియేషన్ చేస్తూ.. మురుగు కాలువలను ఆక్రమించి నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ► ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా లక్ష్మీనివాస్ లైన్లో ఇటీవల వాణిజ్య భవనాలు నిర్మించారు. కొన్నింటిలో సెట్బాక్లకు తిలోదకాలిచ్చారు. పార్కింగ్ సౌకర్యం లేకున్నా వాణిజ్య భవనం, హోటల్, లాడ్జి..ఇలా అనుమతులు ఇచ్చేశారు. ఇబ్బంది ఉన్నా..పర్యవేక్షిస్తున్నాం బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. అయినా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, చైన్మన్ల ద్వారా తనిఖీలు చేస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన సమయంలో వెంటనే స్పందిస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. నిర్మాణాల్లో డీవియేషన్లు ఉంటే భవిష్యత్తులోయజమానులకే ఇబ్బంది. ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. – శాస్త్రి షబ్నం, అడిషనల్ సిటీ ప్లానర్, కర్నూలు నగరపాలక సంస్థ