అడిగే వారెవరు? అడ్డంగా కట్టేదాం!
►వాణిజ్య సముదాయాలు, భవన నిర్మాణాల్లో ఇష్టారాజ్యం
►సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు
►పట్టించుకోని పట్టణ ప్రణాళిక విభాగం
►బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు లేక కొరవడిన పర్యవేక్షణ
‘పట్టణ ప్రణాళిక’ గాడి తప్పింది. అడ్డగోలు నిర్మాణాలతో కర్నూలు నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలను కాలరాసి, ఇష్టమొచ్చినట్లు భవనాలు నిర్మిస్తున్నా అడిగే నాథులే కరువయ్యారు. పర్యవేక్షణ అధికారుల కొరత, సిబ్బంది చేతివాటం కారణంగా భవన యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కర్నూలు (టౌన్) : నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 5.50 లక్షల జనాభా ఉంది. 1.30 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాణిజ్య సముదాయాలు, భవన, ఇళ్ల నిర్మాణాలు భారీసంఖ్యలోనే చేపడుతున్నారు. చాలా వరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయినా ప్రశ్నించే వారు లేరు. నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో 51 వార్డులకు గాను ఏడుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. వీరంతా ప్రతిరోజూ ఉదయం నుంచే కాలనీలలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించాలి. అనుమతులు తీసుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపడుతున్నారా, లేదా అన్నది తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమాన విధించడం వంటి చర్యలు తీసుకోవాలి.
అయితే.. ఇక్కడ అలాంటి ఊసే లేదు. ఒక్క బిల్డింగ్ ఇన్‌స్పెక్టరూ లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. సిటీ ప్లానర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. డిప్యూటీ సిటీప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ –2, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు ముగ్గురు, ఒక టౌన్ ప్లానింగ్ ట్రేసర్, సర్వేయర్, ఆరుగురు చైన్‌మన్లు పనిచేస్తున్నారు. వీరందరి కంటే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లే కీలకం. ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో భవన నిర్మాణదారుల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నారు. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు అడ్డగోలు నిర్మాణాల వద్ద హడావుడి చేసి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది.
సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు
వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనే అక్రమ నిర్మాణాలు ఎక్కువగా సాగుతున్నాయి. గాంధీనగర్, విద్యానగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం విద్యానగర్‌లో ఓ ఇంటి నిర్మాణానికి నగరపాలక పట్టణ ప్ర«ణాళిక విభాగం నుంచి అనుమతి తీసుకున్న వ్యక్తి ఇంటితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే..దీనిపై వివాదం తలెత్తడంతో నిర్మాణానికి బ్రేక్ పడింది.
► అబ్ధుల్లా ఖాన్ ఎస్టేట్‌లో అయ్యప్పస్వామి గుడి ఎదురుగా వాణిజ్య పరమైన నిర్మాణం చేపడుతున్నారు. డీవియేషన్ చేస్తూ.. మురుగు కాలువలను ఆక్రమించి నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
► ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా లక్ష్మీనివాస్ లైన్‌లో ఇటీవల వాణిజ్య భవనాలు నిర్మించారు. కొన్నింటిలో సెట్‌బాక్‌లకు తిలోదకాలిచ్చారు. పార్కింగ్ సౌకర్యం లేకున్నా వాణిజ్య భవనం, హోటల్, లాడ్జి..ఇలా అనుమతులు ఇచ్చేశారు.
ఇబ్బంది ఉన్నా..పర్యవేక్షిస్తున్నాం
బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. అయినా టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, చైన్‌మన్ల ద్వారా తనిఖీలు చేస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన సమయంలో వెంటనే స్పందిస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. నిర్మాణాల్లో డీవియేషన్‌లు ఉంటే భవిష్యత్తులోయజమానులకే ఇబ్బంది. ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి.
– శాస్త్రి షబ్నం, అడిషనల్ సిటీ ప్లానర్, కర్నూలు నగరపాలక సంస్థ