అవినీతి కార్పొరేషన్‌..కమీషన్‌ ఇస్తేనే బిల్లులకు మోక్షం | Nirvana For The Bills As The Commission Gives | Sakshi
Sakshi News home page

అవినీతి కార్పొరేషన్‌..కమీషన్‌ ఇస్తేనే బిల్లులకు మోక్షం

Published Fri, Mar 8 2019 9:28 AM | Last Updated on Fri, Mar 8 2019 9:28 AM

Nirvana For The Bills As The Commission Gives - Sakshi

నెల్లూరులోని కార్పొరేషన్‌ కార్యాలయం

సాక్షి, నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్‌న్లున్నాయి. ఆయా డివిజన్లలో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్‌ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ నిర్మాణాలను నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో చేయించాల్సిన బాధ్యత ఇంజినీరింగ్‌ విభాగం అధికారులది. సదరు విభాగంలో ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్, ముగ్గురు ఈఈలు, ఐదుగురు డీఈలు, 12 మంది ఏఈలు, 60 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్లు ముందస్తుగా నిర్ణయించారని ఓ కాంట్రాక్టర్‌ తెలిపారు. కమీషన్‌ ఇవ్వకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు.

 వారికి తప్పనిసరి..
కాంట్రాక్టర్‌ ఏదైనా రోడ్డు, కాలువ నిర్మాణాలు చేపట్టాలంటే అధికారులతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇన్‌చార్జి లకు సైతం కమీషన్లు ఇవ్వాల్సిందే. వారి డివిజన్లలో పనులు చేయాలంటే తప్పనిసరిగా ఐదుశాతం ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కమీషన్‌ ఇవ్వకపోతే నాణ్యత లేదంటూ కుంటిసాకులు చెబుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఓ వైపు అ«ధికారులు, మరో అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇవ్వడంతో పలువురు నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కాగా ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి సంతకాలు పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు విషయం అకౌంట్స్‌ విభాగంలో ఉంటుంది. దీంతో అకౌంట్స్‌ విభాగంలోని ఓ అధికారికి ఒక శాతం, ఎగ్జామినర్‌కు ఒక శాతం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆ విభాగంలోని ఓ అటెండర్‌ కూడా కాంట్రాక్టర్‌ వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది.

పెట్రోల్, డీజిల్‌లోనూ..
కార్పొరేషన్‌ పరిధిలో చెత్తాచెదారాలు తరలించేందుకు వాహనాలు  కుక్కలగుంటలోని వెహికల్‌ షెడ్‌లో పెట్రోల్, డీజిల్‌ను నింపుకోవాల్సి ఉంది. అయితే స్థానిక ఏఈ ఆంజనేయులరాజు (గురువారం ఏసీబీ దాడిలో పట్టుపడ్డ వ్యక్తి) ట్రిప్పులు ఎక్కువ తిరిగినట్లు లెక్కలు చూపి పెట్రోల్, డీజిల్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 4 లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని సమాచారం. ఏసీబీ దాడిలో ఆంజనేయులు పట్టుపడ్డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల కార్లకు సైతం ఈ షెడ్‌ నుంచి డీజిల్‌ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారుల వాహనాలకు ఇక్కడ డీజిల్‌ పట్టకూడదు.

లంచం డిమాండ్‌
నగరపాలక సంస్థ అధికారులు 18 ట్రాక్టర్ల ద్వారా పలు ప్రాంతాల్లోని ప్రజలను తాగునీరు అందిస్తున్నారు. సదరు ట్రాక్టర్లు రోజూ సుమారు 97 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఒక్కో ట్రిప్పునకు రూ.435 చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి 8 ఎనిమిది ట్రిప్పులు తిరగాలి. అయితే కొందరు ట్రిప్పులు తక్కువ నగదు స్వాహా చేస్తున్నారు. అధికారులు వారి నుంచి నగదు తీసుకుని పట్టించుకోవడంలేదు. కొందరు సక్రమంగా ట్రిప్పులు వేసినా అధికారులు బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవిగో అక్రమాలు
+    నెల్లూరు మైపాడుగేట్‌ సెంటర్‌లో రూ.50 లక్షల వర్క్‌కు సంబంధించి రెండు శాతం కమీషన్‌ చెల్లించాలని ఓ అధికారి కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్‌ తనకు నష్టం వచ్చిందని చెప్పినా అధికారి పట్టించుకోలేదు. నగదు తీసుకున్నాకే సంతకాలు చేసినట్లు చెబుతున్నారు.
+    బారాషహిద్‌ దర్గాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి కాంట్రాక్టర్‌ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారి పేరు చెప్పి మరో రూ.లక్ష కూడా వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది.  
+    గతంలో పంచాయతీరాజ్‌ శాఖ నుంచి బదిలీపై కార్పొరేషన్‌కు వచ్చిన ఓ అధికారి ఒకటో డివిజన్‌ నుంచి ఐదో డివిజన్‌ వరకు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తాను కూడా పనుల్లో భాగం తీసుకుంటున్నట్లు కార్పొరేషన్‌ వర్గాల సమాచారం. రూ.10 లక్షల పనిలో ఏఈ కూడా రూ.5 లక్షలు భాగంతో పనులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా పనుల్లో నాణ్యతను పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.
+    ఇంజినీరింగ్‌ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ఫిట్టర్లకు డివిజన్‌ కేటాయింపుల్లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. నగదు తీసుకుని ఓ ఫిట్టర్‌కు డివిజన్‌ కేటాయించకపోవడంతో అతను అధికారి వ్యవహారం బట్టబయలు చేశాడు. ఈ విషయం కార్పొరేషన్‌లో కలకలం రేపింది. 

అవినీతిపరులకు కీలక బాధ్యతలు 
మంత్రి నారాయణ అవినీతిపరులైన కొందరికి కార్పొరేషన్‌లో అధికార ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఓ మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ దాడి చేసింది. వారు భారీగా అక్రమాస్తులు కుడబెట్టారనే విషయాన్ని గుర్తించింది. దీంతో వారిని సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ ఉత్తర్వులు జారీచేశారు. అలాంటి వారికి మంత్రి నారాయణ కార్పొరేషన్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ అధికారిని పారిశుద్ధ్య ం మెరుగుపరిచేందుకు ప్రత్యేకాధికారిగా మౌఖిక ఆదేశాలతో నియమించారు. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు నెల్లూరు కార్పొరేషన్‌లో బాధ్యతలు ఇవ్వకూడదని మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను మంత్రి ద్వారా మేయర్‌ పేషీలో కీలక స్థానం సంపాదించాడు. దీంతో కార్పొరేషన్‌లోని ఉద్యోగులు అవినీతిపరులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement