Building Inspectors
-
విజయవాడ : అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా
సాక్షి, విజయవాడ : విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు. నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపై చర్యలకు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అనిశా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
అవినీతి కార్పొరేషన్..కమీషన్ ఇస్తేనే బిల్లులకు మోక్షం
సాక్షి, నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్న్లున్నాయి. ఆయా డివిజన్లలో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ నిర్మాణాలను నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో చేయించాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగం అధికారులది. సదరు విభాగంలో ఇంజినీరింగ్ సూపరింటెండెంట్, ముగ్గురు ఈఈలు, ఐదుగురు డీఈలు, 12 మంది ఏఈలు, 60 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్లు ముందస్తుగా నిర్ణయించారని ఓ కాంట్రాక్టర్ తెలిపారు. కమీషన్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. వారికి తప్పనిసరి.. కాంట్రాక్టర్ ఏదైనా రోడ్డు, కాలువ నిర్మాణాలు చేపట్టాలంటే అధికారులతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇన్చార్జి లకు సైతం కమీషన్లు ఇవ్వాల్సిందే. వారి డివిజన్లలో పనులు చేయాలంటే తప్పనిసరిగా ఐదుశాతం ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కమీషన్ ఇవ్వకపోతే నాణ్యత లేదంటూ కుంటిసాకులు చెబుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఓ వైపు అ«ధికారులు, మరో అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇవ్వడంతో పలువురు నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కాగా ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంతకాలు పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు విషయం అకౌంట్స్ విభాగంలో ఉంటుంది. దీంతో అకౌంట్స్ విభాగంలోని ఓ అధికారికి ఒక శాతం, ఎగ్జామినర్‌కు ఒక శాతం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆ విభాగంలోని ఓ అటెండర్ కూడా కాంట్రాక్టర్ వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది. పెట్రోల్, డీజిల్లోనూ.. కార్పొరేషన్ పరిధిలో చెత్తాచెదారాలు తరలించేందుకు వాహనాలు కుక్కలగుంటలోని వెహికల్ షెడ్లో పెట్రోల్, డీజిల్‌ను నింపుకోవాల్సి ఉంది. అయితే స్థానిక ఏఈ ఆంజనేయులరాజు (గురువారం ఏసీబీ దాడిలో పట్టుపడ్డ వ్యక్తి) ట్రిప్పులు ఎక్కువ తిరిగినట్లు లెక్కలు చూపి పెట్రోల్, డీజిల్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 4 లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని సమాచారం. ఏసీబీ దాడిలో ఆంజనేయులు పట్టుపడ్డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల కార్లకు సైతం ఈ షెడ్ నుంచి డీజిల్‌ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారుల వాహనాలకు ఇక్కడ డీజిల్ పట్టకూడదు. లంచం డిమాండ్ నగరపాలక సంస్థ అధికారులు 18 ట్రాక్టర్ల ద్వారా పలు ప్రాంతాల్లోని ప్రజలను తాగునీరు అందిస్తున్నారు. సదరు ట్రాక్టర్లు రోజూ సుమారు 97 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఒక్కో ట్రిప్పునకు రూ.435 చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి 8 ఎనిమిది ట్రిప్పులు తిరగాలి. అయితే కొందరు ట్రిప్పులు తక్కువ నగదు స్వాహా చేస్తున్నారు. అధికారులు వారి నుంచి నగదు తీసుకుని పట్టించుకోవడంలేదు. కొందరు సక్రమంగా ట్రిప్పులు వేసినా అధికారులు బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవిగో అక్రమాలు + నెల్లూరు మైపాడుగేట్ సెంటర్లో రూ.50 లక్షల వర్క్‌కు సంబంధించి రెండు శాతం కమీషన్ చెల్లించాలని ఓ అధికారి కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్ తనకు నష్టం వచ్చిందని చెప్పినా అధికారి పట్టించుకోలేదు. నగదు తీసుకున్నాకే సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. + బారాషహిద్ దర్గాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారి పేరు చెప్పి మరో రూ.లక్ష కూడా వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది. + గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై కార్పొరేషన్‌కు వచ్చిన ఓ అధికారి ఒకటో డివిజన్ నుంచి ఐదో డివిజన్ వరకు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తాను కూడా పనుల్లో భాగం తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ వర్గాల సమాచారం. రూ.10 లక్షల పనిలో ఏఈ కూడా రూ.5 లక్షలు భాగంతో పనులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా పనుల్లో నాణ్యతను పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. + ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ఫిట్టర్లకు డివిజన్ కేటాయింపుల్లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. నగదు తీసుకుని ఓ ఫిట్టర్‌కు డివిజన్ కేటాయించకపోవడంతో అతను అధికారి వ్యవహారం బట్టబయలు చేశాడు. ఈ విషయం కార్పొరేషన్లో కలకలం రేపింది. అవినీతిపరులకు కీలక బాధ్యతలు మంత్రి నారాయణ అవినీతిపరులైన కొందరికి కార్పొరేషన్లో అధికార ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఓ మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్పై ఏసీబీ దాడి చేసింది. వారు భారీగా అక్రమాస్తులు కుడబెట్టారనే విషయాన్ని గుర్తించింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ ఉత్తర్వులు జారీచేశారు. అలాంటి వారికి మంత్రి నారాయణ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ అధికారిని పారిశుద్ధ్య ం మెరుగుపరిచేందుకు ప్రత్యేకాధికారిగా మౌఖిక ఆదేశాలతో నియమించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు నెల్లూరు కార్పొరేషన్లో బాధ్యతలు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను మంత్రి ద్వారా మేయర్ పేషీలో కీలక స్థానం సంపాదించాడు. దీంతో కార్పొరేషన్‌లోని ఉద్యోగులు అవినీతిపరులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అడిగే వారెవరు? అడ్డంగా కట్టేదాం!
►వాణిజ్య సముదాయాలు, భవన నిర్మాణాల్లో ఇష్టారాజ్యం ►సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు ►పట్టించుకోని పట్టణ ప్రణాళిక విభాగం ►బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేక కొరవడిన పర్యవేక్షణ ‘పట్టణ ప్రణాళిక’ గాడి తప్పింది. అడ్డగోలు నిర్మాణాలతో కర్నూలు నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలను కాలరాసి, ఇష్టమొచ్చినట్లు భవనాలు నిర్మిస్తున్నా అడిగే నాథులే కరువయ్యారు. పర్యవేక్షణ అధికారుల కొరత, సిబ్బంది చేతివాటం కారణంగా భవన యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు (టౌన్) : నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 5.50 లక్షల జనాభా ఉంది. 1.30 లక్షల ఇళ్లు ఉన్నాయి. వాణిజ్య సముదాయాలు, భవన, ఇళ్ల నిర్మాణాలు భారీసంఖ్యలోనే చేపడుతున్నారు. చాలా వరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అయినా ప్రశ్నించే వారు లేరు. నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో 51 వార్డులకు గాను ఏడుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. వీరంతా ప్రతిరోజూ ఉదయం నుంచే కాలనీలలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించాలి. అనుమతులు తీసుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపడుతున్నారా, లేదా అన్నది తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమాన విధించడం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే.. ఇక్కడ అలాంటి ఊసే లేదు. ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టరూ లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. సిటీ ప్లానర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. డిప్యూటీ సిటీప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ –2, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు ముగ్గురు, ఒక టౌన్ ప్లానింగ్ ట్రేసర్, సర్వేయర్, ఆరుగురు చైన్మన్లు పనిచేస్తున్నారు. వీరందరి కంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లే కీలకం. ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో భవన నిర్మాణదారుల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నారు. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు అడ్డగోలు నిర్మాణాల వద్ద హడావుడి చేసి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. సెట్‌బ్యాక్‌లకు తిలోదకాలు వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనే అక్రమ నిర్మాణాలు ఎక్కువగా సాగుతున్నాయి. గాంధీనగర్, విద్యానగర్, భాస్కర్ నగర్ ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం విద్యానగర్‌లో ఓ ఇంటి నిర్మాణానికి నగరపాలక పట్టణ ప్ర«ణాళిక విభాగం నుంచి అనుమతి తీసుకున్న వ్యక్తి ఇంటితో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నించాడు. అయితే..దీనిపై వివాదం తలెత్తడంతో నిర్మాణానికి బ్రేక్ పడింది. ► అబ్ధుల్లా ఖాన్ ఎస్టేట్‌లో అయ్యప్పస్వామి గుడి ఎదురుగా వాణిజ్య పరమైన నిర్మాణం చేపడుతున్నారు. డీవియేషన్ చేస్తూ.. మురుగు కాలువలను ఆక్రమించి నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ► ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా లక్ష్మీనివాస్ లైన్లో ఇటీవల వాణిజ్య భవనాలు నిర్మించారు. కొన్నింటిలో సెట్బాక్లకు తిలోదకాలిచ్చారు. పార్కింగ్ సౌకర్యం లేకున్నా వాణిజ్య భవనం, హోటల్, లాడ్జి..ఇలా అనుమతులు ఇచ్చేశారు. ఇబ్బంది ఉన్నా..పర్యవేక్షిస్తున్నాం బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. అయినా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, చైన్మన్ల ద్వారా తనిఖీలు చేస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన సమయంలో వెంటనే స్పందిస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. నిర్మాణాల్లో డీవియేషన్లు ఉంటే భవిష్యత్తులోయజమానులకే ఇబ్బంది. ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. – శాస్త్రి షబ్నం, అడిషనల్ సిటీ ప్లానర్, కర్నూలు నగరపాలక సంస్థ -
రూ.22 కోట్లు బొక్కేశారు..!
నగరపాలక సంస్థలో భారీ కుంభకోణం ♦ భవన నిర్మాణాల అనుమతుల మంజూరులో చేతివాటం ♦ ఒక్కొక్క యజమాని నుంచి రూ.లక్షల్లో తీసుకుని వేలల్లో జమ ♦ మిగిలిన సొమ్మును మింగేసిన లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ♦ ఆడిట్ తనిఖీల్లో వెలుగు చూసిన అవినీతి బాగోతం ♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఉన్నతాధికారులు ♦ టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లపై విజిలెన్స్‌కు లేఖ నగరపాలక సంస్థలో ఇదో భారీ కుంభకోణం..సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును పక్కదారి పట్టించి ఏకంగా 22 కోట్ల రూపాయల వరకు బొక్కేశారు. ఈ అవినీతి దందాలో పరిపాలన సిబ్బంది, లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల నుంచి పూర్వ కమిషనర్ల వరకు కార్పొరేషన్‌కు పంగనామాలు పెట్టినవారే. మూడేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ అవినీతి బాగోతంపై ‘సాక్షి’ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది.. అరండల్‌పేట(గుంటూరు) : నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి కేరాఫ్ అని ప్రజలు భావిస్తుంటారు. అందులో పట్టణ ప్రణాళిక విభాగం అంటే ముడుపులు ఇవ్వనిదే పనిజరగదన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఈ సారి అధికారులు సరికొత్త పంథాలో అవినీతికి తెరతీశారు. నగరంలో భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాల కోసం అనుమతులు కోరుతూ లెసైన్స్డ్ ఇంజినీర్లు ద్వారా భవన యజమానులు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. వీటిని పరిశీలించిన బిల్డింగ్ ఇన్స్పెక్టరు, పరిపాలనా సిబ్బంది నిబంధనల మేరకు చెల్లించాల్సిన ఫీజులపై యజమానులకు ఎండార్స్మెంట్లు పంపేవారు. ఉదాహరణకు ఒక అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలంటే కార్పొరేషన్‌కు నాలుగు లక్షల రూపాయలు ఫీజుగా చెల్లించాలని ఎండార్స్మెంట్ పంపేవారు. యజమాని నుంచి ఈ డబ్బు తీసుకున్న లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కేవలం రూ. 40 వేలు మాత్రమే కార్పొరేషన్‌కు చెల్లించేవారు. రశీదులో నలభైవేల పక్కన సున్నాలు కలిపి నాలుగు లక్షలుగా చూపి దరఖాస్తు ఫారానికి జత చేసేవారు. మిగిలిన రూ. 3.60 లక్షలు పంచుకొనేవారు. ఇలా మూడేళ్లలో రూ. 22 కోట్లు నొక్కేశారు. బయటపడిందిలా.. నగరపాలక సంస్థలో మూడు సంవత్సరాలుగా జరిపిన లావాదేవీలపై ఆడిట్ అధికారులు ఈ నెలలో తనిఖీలు నిర్వహించారు. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా మంజూరు చేసిన భవనాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. దీనిలో కొంతమంది లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పాత్రధారులుగా గుర్తించారు. ఆడిట్ అధికారులు సంబంధిత ఫైళ్లు ట్యాంపరింగ్ అయిన సొమ్ము, బాధ్యులైన అధికారుల పేర్లను గత కమిషనర్ కన్నబాబుకు అందజేసినట్టు సమాచారం. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు.... పట్టణ ప్రణాళికా విభాగంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌లో ప్రధాన పాత్రదారులపై చర్యలు తీసు కోవాల్సిందిగా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదేవిధంగా మూడేళ్లుగా పట్టణ ప్రణాళికా విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లు, తదితర అంశాలపై విజిలెన్స్ విచారణకు లేఖ రాస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ... నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల ధన దాహంతో అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తూ కార్పొ రేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. నగరంలో నెలకు 80 నుంచి వంద నిర్మాణాలు జరుగుతు న్నాయి. వీటిద్వారా కార్పొరేషన్ ఆదాయానికి గండిపడటంతో పాటు పట్టణ ప్రణాళికాధికారుల జేబు లు నిండుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. - ఈదర వీరయ్య,పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షులు -
అసలేం జరుగుతోంది..!
- టౌన్‌ప్లానింగ్ తీరుపై డీటీసీపీ సీరియస్ - ప్రయివేటు దందా చెలాయిస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు - ఫిర్యాదులున్నా చర్యల్లేవు విజయవాడ సెంట్రల్ : టౌన్‌ప్లానింగ్ తీరుపై టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ తిమ్మారెడ్డి గుర్రుగా ఉన్నారు. ముఖ్య అధికారితో పాటు కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల వ్యవహారంపై నేరుగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల నగరానికి విచ్చేసిన తిమ్మారెడ్డి ఒక ప్రముఖ హోటల్లో ముఖ్య అధికారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ‘కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు దొరికితే దొంగలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలేం జరుగుతోంది ఇక్కడ? నా వరకూ ఫిర్యాదు వస్తే బాగోదు’ అంటూ సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రయివేటు దందా ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సరెండరవగా, ఒకర్ని సస్పెండ్ చేశారంటేనే టౌన్‌ప్లానింగ్ పరిస్థితి బాగోలేదన్న విషయం అర్థమవుతోంది. ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు రూ.లక్షల మొత్తంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బినామీ పేర్లతో కోట్లు విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ చైన్మెన్లను పక్కన పెట్టి డివిజన్లలో అక్రమ కట్టడాలు, మామూళ్ల వసూళ్ల కోసం ప్రయివేటు వ్యక్తులను ముగ్గురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు నియమించుకున్నారు. వాళ్ల ద్వారానే మామూళ్ల మంత్రాగం నడుస్తోందనేది బహిరంగ రహస్యం. సాయంత్రమయ్యే సరికి టౌన్‌ప్లానింగ్‌లో వాలిపోయే బ్రోకర్లు గప్‌చుప్‌గా అక్రమ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ దగ్గర నుంచి మార్ట్గేజ్ వరకు అంతా వారి కనుసన్నల్లోనే జరిగిపోతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెప్పినా జరగని పనులను సైతం వీళ్లు చక్కబెట్టేస్తున్నారు. పదోన్నతిపై బదిలీ అయిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం వెనుక భారీ డీల్స్ నడిచినట్లు తెలుస్తోంది. రెచ్చిపోతున్నారు కర్ర ఉన్న వాడిదే గొర్రె అన్న చందంగా టౌన్‌ప్లానింగ్‌లో పరిస్థితి తయారైంది. చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక పవర్ బ్రోకర్ ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను బెదరేసి మరీ పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విజిలెన్స్, ఏసీబీ పెద్దల పేర్లు ఉపయోగించినట్లు సమాచారం. మార్ట్గేజ్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్స్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతిపై విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సి‘ఫార్సు’పై సీరియస్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇటీవలే నలుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు టీపీఎస్‌లను పదోన్నతిపై వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు చేశారు. బదిలీ అయిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల స్థానే కొత్తవారు వచ్చే వరకు రిలీవ్ చేయడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. టీపీవో (టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్)గా రంగప్రసాద్, రాంబాబు పదోన్నతి పొందారు. రాంబాబు రిలీవై నూజివీడు వెళ్లగా రంగప్రసాద్ డెప్యూటేషన్‌పై ఇంకా ఉయ్యూరులోనే టీపీఎస్‌గా కొనసాగుతున్నారు. ఎమ్మిగనూరులో పోస్టింగ్ చేపట్టేందుకు నిరాకరిస్తున్న రంగప్రసాద్ పలువురి పెద్దలతో సి‘ఫార్సు’లు చేయించడంపై డీటీసీపీ తిమ్మారెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. టీపీఎస్‌లుగా ఇద్దరు కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చినప్పటికీ ఎందుకు రిలీవ్ చేయడం లేదని ముఖ్య అధికారిని డీటీసీపీ గట్టిగా నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తం మీద టౌన్‌ప్లానింగ్ అక్రమాలు ముఖ్య అధికారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
కొంపముంచిన మామూళ్ల పంచాయితీ
కమిషనర్ పేరుతో కలెక్షన్లు వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు కలకలం రేపిన ‘సాక్షి’ కథనం విజయవాడ సెంట్రల్ : అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కుల్లో కలకలం మొదలైంది. విజిలెన్స్ విచారణ లోతుగా సాగితే తమ కొంప కొల్లేరవుతుందని పలువురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ‘టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి ప్రకంపనలు’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ సాగింది. టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై వచ్చే ఆరోపణలపై ఇప్పటి వరకు శాఖాపరమైన దర్యాప్తు సాగింది కాబట్టి ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. నేరుగా ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో మూల్యం భారీగా చెల్లించుకోక తప్పదనే భయం అక్రమార్కులను వెంటాడుతోంది. మూమూళ్ల పంపకాల్లో తేడాల వల్లే.. మామూళ్ల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే విజిలెన్స్‌ను ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ల (టీపీఎస్) మధ్య కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు సమాచారం. వన్‌టౌన్‌లో అక్రమ కట్టడాలకు సంబంధించి ఒక టీపీఎస్ భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు వినికిడి. తన పరిధి కాని దాంట్లో అతను తలదూర్చి డబ్బులు దండుకోవడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. సిటీ ప్లానర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఈ టీపీఎస్ ఓవర్ యాక్షన్ ఎక్కువవడంపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రమంత్రి బావమరిది పటమట ప్రాంతంలో ఇల్లు కట్టారు. మార్ట్గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరారు. నిబంధనల పేరుతో అతని వద్ద టీపీఎస్ చేయిచాచడంతో ‘మా బావ ఎవరో తెలుసా అంటూ’ మంత్రి బావమరిది వార్నింగ్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న టీపీఎస్ మార్ట్గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా బిల్డింగ్ ఇన్పెక్టర్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కమిషనర్ పేరుతో కలెక్షన్ కమిషనర్ పేరుతో టౌన్ ప్లానింగ్‌లో కలెక్షన్ చేస్తున్నట్లు బలమైన విమర్శలు ఉన్నాయి. ఇటీవల బదిలీ అయిన సి.హరికిరణ్ తన హయాంలో టౌన్‌ప్లానింగ్ నుంచి వచ్చే కొన్ని ఫైళ్లపై స్పీక్, డిస్కస్ అని రాసేవారని తెలుస్తోంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ఇద్దరు అధికారులు గృహ నిర్మాణదారుల నుంచి గట్టిగా ఆమ్యామ్యాలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్బీపేట గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలో ఒక భవనం మార్ట్గేజ్ రిలీజ్‌కు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫైల్‌పై కమిషనర్ డిస్కస్ అని రాయడంతో ‘కమిషనర్ మీ బిల్డింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఆక్యుపెన్సీ రావడం కష్టం’ అంటూ ఆ భవన యజ మానిని బెదిరించి మూడు లక్షల రూపాయలు గుంజినట్లు తెలుస్తోంది. అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ నిష్పక్షపాతంగా జరిగితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.