అనంతపురం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.500 కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2014కు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.70 వేలు ఉండేదన్నారు. ఆ మొత్తం సరిపోక 2 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా వదిలేశారన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి లబ్ధిదారులకు అదనంగా రూ.25 వేలు మంజూరు చేయాలని ఆదేశించారన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీన జీఓ 64ను విడుదల చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని 27,197 మంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఎన్‌టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్లు నిర్మించుకునే వారికి యూనిట్‌కు రూ.1.50 లక్ష మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీ, హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.