– అక్రమార్జనకు అనంతను అడ్డాగా ఎంచుకున్న ‘పెద్దలు’
– అభివృద్ధి పేరిట భారీగా నిధుల కేటాయింపు
– అంచనా వ్యయం పెంచి దండుకునే వ్యూహం
– ఇతరులు టెండర్లు వేయకుండా ‘ఫ్యాక‌్షన్’ బూచీ
- అస్మదీయులకు కట్టబెట్టే ఎత్తుగడ
– ఇప్పటికే రూ.వేల కోట్ల దోపిడీకి ప్రణాళిక
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
రామకృష్ణ హైదరాబాద్‌కు పనిపై వెళ్లాడు. పర్సులో రూ.10 వేల నగదు ఉంది. దాన్ని వెంకటేశ్ అనే వ్యక్తి కొట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ తరచి చూసుకుంటే పర్సులేదు. జేబులో చిల్లిగవ్వలేదు. ఇంటికెలా వెళ్లాలని వేదన పడుతున్నాడు. అప్పుడు వెంకటేశ్ వచ్చి ఏం జరిగిందని అడిగాడు. జరిగిన విషయం చెప్పాడు. ‘బాధపడకు.. ఇదిగో ఈ వెయ్యి తీసుకో! కడుపు నిండా భోజనం తిని ఇంటికెళ్లు’ అని ఉదారత ప్రదర్శించాడు. అమితానందంతో రామకృష్ణ రెండుచేతులు జోడించి వెంకటేశ్‌కు నమస్కరించి వెళ్లిపోయాడు. కానీ తన పర్సు కొట్టేసింది వెంకటేశే అని, అతనికి రూ.9 వేలు మిగిలాయని రామకృష్ణకు తెలీదు. అచ్చం ఇలాగే ఉంది అనంతపురం అభివృద్ధిపై ప్రభుత్వ పెద్దల తీరు! కరువు జిల్లాను అభివృద్ధి చేస్తామంటూ రూ.కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే జరిగిన, జరగబోయే అభివృద్ధి దేవుడెరుగు కానీ రూ.వందల కోట్లను అప్పనంగా దోచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ‘అనంత’ వేదికగా ఈ దోపిడీ సాగిస్తున్నారు.
దోపిడీకి సాక్ష్యాలివిగో..
రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్లతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం చేపట్టారు. జిల్లాలో 3.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో రూ.6,483.8 కోట్ల మేర ఖర్చు చేసి 90శాతం పనులు పూర్తి చేశారు. తక్కిన 10 శాతం పనులను రూ.367 కోట్లతో చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచింది. పాత ఏజెన్సీలను రద్దుచేసి అస్మదీయులకు పనులు కట్టబెట్టింది. భారీగా లబ్ధి చేకూర్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక‌్షన్స్‌కు కేటాయింపుల కంటే రూ.6.50 కోట్లను అధికంగా చెల్లింపులు జరిపారని ఏకంగా ‘కాగ్’ కడిగేసిందంటే హంద్రీ–నీవా పనుల్లో ఏస్థాయిలో దోపిడీ జరిగిందో ఇట్టే తెలుస్తోంది.
- పేరూరు ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.850 కోట్లు సీఎం ప్రకటించారు. అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఏకంగా రూ.1,149 కోట్లతో సిద్ధం చేశారు. నిజానికి ఈ పనులకు రూ.30 కోట్లకు మించి ఖర్చు కాదు. మడకశిర బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ)లో 26వ కిలోమీటర్ వద్ద (6వ లిఫ్ట్) తురకలాపట్నం వంకలోకి నీళ్లు వదిలితే పెదకోడిపల్లి, నాగలమడక మీదుగా గ్రావిటీ ద్వారా నేరుగా పేరూరు డ్యాంలోకి వస్తాయి. దీనికి ఎలాంటి ఖర్చూ కాదు. అవసరమైతే వంక పూడిక తీయడం లేదా వంకలో పైపులైన్ వేయాలనుకున్నా రూ.30 కోట్లకు మించదు. ఇది కాకుండా బోరంపల్లి లిఫ్ట్ నుంచి కంబదూరు మీదుగా నీళ్లిచ్చేందుకు మరో మార్గం ఉంది. దీనికి 2009లో రూ.85 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది. వందశాతం అంచనా వ్యయం పెరిగినా రూ.170కోట్లతో ఈ పనులను పూర్తి చేయొచ్చు. కానీ ఈ పనులకు రూ.1,149 కోట్లు కేటాయించారు. ఇందులో దాదాపు రూ.900 కోట్లు దోచుకోవడమే లక్ష్యంగా అంచనాలను సిద్ధం చేయించారు.
– హంద్రీ-నీవా 36వ ప్యాకేజీకి రూ.85కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈ పనులను రూ.336కోట్లకు పెంచేశారు. ఇందులో కూడా రూ.250కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కానుంది. 36వ ప్యాకేజీలో భాగంగానే భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)కు నీళ్లివ్వొచ్చు. అయితే జీడిపల్లి నుంచి మరో మార్గం ద్వారా బీటీపీకి నీళ్లిచ్చేందుకు ఫేజ్–1కు రూ.450కోట్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే.. అధికారులు దీని అంచనా వ్యయాన్ని రూ.1,361 కోట్లకు పెంచి డీపీఆర్ సిద్ధం చేశారు. 36వ ప్యాకేజీలో భాగంగా ఈ పనులను చేస్తే మొత్తం నిధులు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. ఒకవేళ బోరంపల్లి లిఫ్ట్ నుంచి వేరుగా కాలువను తవ్వినా రూ.వంద కోట్లతో పనులు పూర్తి చేయొచ్చు. కానీ రూ.1,361 కోట్లను కేటాయించడం ద్వారా ఇందులో కూడా రూ.1,250 కోట్ల మేర దోపిడీకి ప్రభుత్వం తెరలేపింది.
– పెనుకొండ సమీపంలో ఎర్రమంచి వద్ద ‘కియో’ కార్లపరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ.599.35 ఎకరాల భూములు కొని రైతులకు రూ.62.93 కోట్ల పరిహారం చెల్లించారు. ఈ పొలాల్లో కంపచెట్లు, గట్లు, చిన్నగుట్టలను చదును చేసేందుకు రూ.177.94 కోట్లతో టెండర్లు పిలిచారు. పొలాల కొనుగోలు కంటే వాటిని చదునుచేసేందుకు రెండురెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుండటాన్ని చూస్తే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ పనులకు అత్యధికం అనుకున్నా రూ.25కోట్లకు మించి కాదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఇందులో రూ.150 కోట్ల మేర దోపిడీ జరగనుంది.
– హెచ్చెలీ ఆధునికీకరణలో భాగంగా 43వ ప్యాకేజీలో రూ.233.65కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.188 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌కు రూ.113.32 కోట్లు కలిపి మొత్తం రూ. 534.97కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో కూడా పెంచిన అంచనా వ్యయంతో రూ.200కోట్ల మేర ని«ధుల దుర్వినియోగానికి రంగం సిద్ధం చేశారు.
– హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పునకు సంబంధించి రూ.831 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఈ పనుల్లో ప్రధాన కాలువను తవ్వడం మినహా ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. ఇందులో కూడా రూ.300 కోట్లకుపైగా దోపిడీ జరగనుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
అస్మదీయులకే టెండర్లు !
ఇన్ని వేలకోట్ల రూపాయల పనులను చేస్తోంది ప్రభుత్వానికి అనుకూలమైన ఏజెన్సీలే! రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక‌్షన్స్, అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక‌్షన్స్‌లకే అధికశాతం టెండర్లు కట్టబెడుతున్నారు. ఇవి కాకుండా మంత్రి పరిటాల సునీతకు చెందిన ఎస్‌కేసీ కూడా ఉంది. వీరు కాకుండా ఇతరులు ఎవరైనా టెండర్లు వేసేందుకు వస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారు. ‘ఈ జిల్లా సంగతి మీకు తెలీదు. ఫ్యాక‌్షన్ జిల్లాలో మీకు సమస్యలు అవసరమా? మేం చూసుకుంటాం. మీరు టెండర్లు వేయొద్దు’ అంటూ బెదరగొడుతున్నారు. దీంతో భయపడి ఇతర ఏజెన్సీలు టెండర్లకు ముందుకు రావడం లేదు.
దీంతో పనులను ఆస్థాన ఏజెన్సీలకు కట్టబెట్టి..వాటి చాటున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా దోచుకుంటున్నారు. హెచ్చెల్సీ టెండర్లలో తక్కువకు కోట్ చేసిన వారిని కాదని అస్మదీయులకు కట్టబెట్టడం, హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనుల్లోనూ 2–5శాతం ఎక్కువకు కోట్ చేసిన వారికి ఇవ్వడాన్ని చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీని ఎలా సాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రూ.100 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని రెండు, మూడురెట్లు పెంచడం, ఈ నిధుల్లో అంతా వాటాలు పంచుకోవడం.. ఇదే ప్రాతిపదికన జిల్లాలో దోపిడీ సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు, జిల్లా ప్రజాప్రతినిధులు కలిసి దండుకునేందుకు ‘అనంత’ను వేదికగా ఎంచుకున్నారు. భారీగా నిధులు ఖర్చు చేయడం మినహా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏదీ లేదనేది ప్రజలు గుర్తించాల్సి ఉంది.
దోపిడీ ‘అనంతం’
Published Fri, May 12 2017 11:03 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement