దిష్టిబొమ్మల్లా మారాం
– నిధులివ్వకపోతే పనులెలా చేయాలి?
– ప్రజల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాం
– జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదన
– చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపాటు
–సమావేశాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష సభ్యులు
అనంతపురం సిటీ : ‘జిల్లా పరిషత్‌కు నిధులివ్వడం లేదు. ఇలాగైతే మేం గ్రామాల్లో అభివద్ధి పనులు ఎలా చేయించాలి? ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? వారి ముందు తలెత్తుకోలేకపోతున్నాం. మాకీ పదవులుండి ఉపయోగం లేదు. సభ్యత్వాన్ని మీరే రద్దు చేయండి. లేదంటే మేమే వైదొలుగుతామ’ని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ చమన్ అధ్యక్షతన స్థానిక జెడ్పీ హాలులో నిర్వహించారు. ముందుగా ఉగ్రమూకల దాడిలో మతి చెందిన జవానులకు సంతాపసూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. గుడిబండ టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ..‘జెడ్పీ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్లాయి. జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అనేక సమస్యల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విజయనగరం జిల్లా పరిషత్‌కు కేంద్రం రూ.పది కోట్ల నిధులిచ్చిందని తెలిసింది. మరి వెనుకబాటుకు గురైన మన జిల్లాకు ఎందుకు ఇవ్వలేకపోతోందో చెప్పాలి. కనీసం రూ.25 కోట్లు ఇస్తే తప్పా...ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కలేమ’ని అన్నారు. అదే పార్టీకి చెందిన అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ నిధుల కోసం రెండేళ్లు నిరీక్షించి నీరసించి పోయామని..ఇక తమ వల్ల కాదని అన్నారు.
తమ సమస్యలు తీర్చనందున సమావేశం నుంచి మూకుమ్మడిగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రారెడ్డి కూడా మద్దతు తెలిపారు. దీంతో సభ్యులందరూ బయటకు వెళుతుండగా.. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవlశ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్, సీఈఓ రామచంద్ర బుజ్జగించారు. దీంతో తిరిగి ఎవరి స్థానాల్లో వారు కూర్చొన్నారు.
హక్కులను కాలరాస్తున్నారు
‘పంటలు ఎండిపోయాయి. తాగునీరు లేదు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రపోతోంది. న్యాయబద్ధంగా జెడ్పీకి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఇక అభివద్ధి ఎలా సాధ్యం? సమస్యలపై స్పందించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదం’టూ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మంగళవారం ప్రజాసమస్యలపై ‘ఈ గోడు పట్టేదెవరికి?’ శీర్షికతో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శించారు.
కాయలు లేని వేరుశనగ చెట్టును చూపిస్తూ ఈ పాపం ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. తాగునీటి కష్టాలు వేసవికి మునుపే వెంటాడుతుంటే అధికారులేం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే ప్రభుత్వ తీరుపై బహిరంగంగా మండిపడుతుంటే ఈ పాలకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఆయనకు అడ్డుతగిలేందుకు యత్నించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాపైనా వెన్నపూస నిప్పులు చెరిగారు. రాజకీయ వ్యభిచారులకు రైతుల కష్టనష్టాలు ఎలా తెలుస్తాయంటూ నిలదీశారు. పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరానికి రూ. 20వేల చొప్పున పరిహారం, వాతావరణ బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ తీరుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి.. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
కాలవ రుబాబు
సభ్యులనుద్దేశించి చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అలిగి వెళ్లిపోతే..పరిణామాలను కూడా దష్టిలో ఉంచుకోవాలంటూ హెచ్చరించారు. ఇలా వెళ్లడం తగదని, పథకాల అమలుపై ప్రజలకు వివరించాలని చెబుతుండగా...హిందూపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ మైకందుకున్నారు. ‘అయ్యా జెడ్పీటీసీలం మీ బిడ్డల్లాంటి వాళ్లం. మీకు (ఎమ్మెల్యేలు) వచ్చే రూ.4 కోట్ల నిధుల్లో మాకూ ఓ పది లక్షలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి’ అంటూ చురకలంటించారు. నిధులు ఇస్తామనలేక, సమాధానం దాట వేయలేక కాలవ ఇబ్బంది పడుతున్న సందర్భంలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మైకందుకున్నారు. తన నిధుల్లోంచి రూ.5 లక్షలు ఇస్తానని చెప్పారు.
ఇంతలోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి తానూ రూ.10 లక్షలు ఇస్తానన్నారు. అయితే.. ఇది సభ్యతగా ఉండదని, ప్రజల్లోకి మరోలా సందేశం వెళుతుందని సభ్యులను కాలవ మందలించారు. మార్గాలు అన్వేషిద్దామని చెప్పారు. ఆయన మాటలను ఏ కోశాన జీర్ణించుకోలేకపోయిన సభ్యులు మౌనంగా ఉండిపోయారు. వారి నిరసన తీరును గుర్తించిన కాలవ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మొత్తమ్మీద సమస్యలపై చర్చించకుండానే, తీర్మానాలను కూడా ఆమోదించకుండానే సమావేశం ముగిసిపోయింది. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.