నిధులు భోంచేస్తున్నారు!
-
ధర్మవరం ఆస్పత్రిలో రెండేళ్లుగా రోగులకు అందని భోజనం
-
అయినప్పటికీ బిల్లుల డ్రా
-
నిధుల దుర్వినియోగంపై సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ పొంతన లేని సమాధానాలు
-
ఇప్పటికే 7 నెలల బిల్లులు ఖాతాల్లోకి జమ
-
మరో విడత చెల్లింపునకు రంగం సిద్ధం
సర్కారు ధర్మాస్పత్రి.. జబ్బుపడిన నిరుపేదలు, సామాన్యులు చికిత్సకు వస్తుంటారు. కొందరు డాక్టరుతో చూపించుకుని మందులు తీసుకుని వెళ్తుంటారు. ఇంకొందరు రోగం నయమయ్యేదాకా ఆస్పత్రిలోనే ఉంటారు. వీరికి ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పిస్తోంది. ధర్మవరం ఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించేందుకు కాంట్రాక్టరు ఉన్నారు. అధికారులు మూణ్నెల్లకోసారి బిల్లులు మంజూరు చేస్తున్నారు.
వాస్తవానికి రెండేళ్లుగా అక్కడ భోజనం వడ్డించడం లేదు. ఈ అవినీతి వ్యవహారం ‘సాక్షి’కి తెలిసి అధికారులను ఆరా తీస్తే ఎవరికి వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రెండేళ్లుగా వడ్డించడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ అంటే, తమ వద్ద బిల్లులు పెండింగ్‌లేవు.. ఇచ్చేశామని డీసీహెచ్‌ఎస్ అంటున్నారు. ధర్మవరం ఆస్పత్రిలో అవినీతి జరిగిందనేందుకు ఈ విరుద్ధ ప్రకటనలే నిదర్శనం.
ధర్మవరం ప్రభుత్వాస్పత్రి 50 పడకల సామర్థ్యంతో నడుస్తోంది. ఇక్కడ రోజూ 30–40మంది ఇన్‌పేషెంట్స్ (ఆస్పత్రి వార్డుల్లో చికిత్స తీసుకునే రోగులు) ఉంటారు. వీరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించేందుకు ఉడుముల రాము అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ సిబ్బంది రోగులు మొత్తం బయట నుంచి భోజనం తెచ్చుకోవడాన్ని గమనించారు. ఇదేంటని ఆరా తీయగా.. ఇక్కడ భోజనం పెట్టరని చెప్పారు. నర్సులు, ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా.. రెండేళ్లుగా భోజనం వడ్డించడం లేదని బాహాటంగానే తెలిపారు.
ఇదీ అసలు తతంగం
రోజూ అన్ని బెడ్లపై రోగులు ఉంటున్నట్లు ఆస్పత్రి అధికారులు డీసీహెచ్‌ఎస్‌కు నివేదిక పంపుతున్నారు. ప్రతినెలా ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్‌పేషెంట్ (ఐపీ) వివరాలు పంపాలి. ఇందులో వందశాతం రోగులు ఐపీలో ఉన్నట్లు చూపిస్తున్నారు. ఐపీలో ఉండే వ్యక్తులకు ఒక్కో బెడ్డుకు రోజుకు రూ.40 చొప్పున డైట్‌చార్జీలు (భోజనం ఖర్చులు) ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ డబ్బు కమిషనర్ నుంచి డీసీహెచ్‌ఎస్‌కు వస్తుంది. డీసీహెచ్‌ఎస్ ఆస్పత్రికి పంపుతారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ మాసాలకు సంబంధించి ధర్మవరం ఆస్పత్రిలో రూ.2లక్షలు డ్రా చేశారు. ఆ తర్వాత డిసెంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మరో రూ.2 లక్షలు డ్రా చేసుకున్నారు. ఈ బిల్లులు డీసీహెచ్‌ఎస్ కార్యాలయం నుంచి ధర్మవరం ఆస్పత్రికి చేరాయి.
ఏప్రిల్, మే, జూన్ బిల్లులు కూడా సిద్ధమవుతున్నాయి. రెండేళ్లుగా భోజనం వడ్డించకపోయినా గత ఏడు నెలల డైట్ చార్జీలు రూ.4 లక్షలు ఆస్పత్రి సూపరింటెండెంట్ పరిధిలోకి చేరాయి. భోజనం వడ్డించకపోయినా బిల్లులు పెట్టే ధైర్యం సూపరింటెండెంట్ చేయడం, ఆస్పత్రిలో పరిస్థితి తెలీకుండా ఈ బిల్లులను డీసీహెచ్‌ఎస్ మంజూరు చేయడం చూస్తుంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఎలాగూ భోజనం వడ్డించలేదు కాబట్టి కాంట్రాక్టరుకు బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నిధులను ఏం చేశారు? ఎవరు ఆరగించారనేది.. కలెక్టర్ తేల్చాల్సి ఉంది. ఈ ఏడు నెలలకు ముందు కూడా ఏ మేరకు బిల్లులు డ్రా చేశారనే దానిపైనా విచారించాల్సి ఉంది.
సూపరింటెండెంట్ ఏమన్నారంటే..
ఈ విషయంపై సూపరింటెండెంట్ రామలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రెండేళ్లుగా భోజనం వడ్డించడం లేదని, అలాంటప్పుడు బిల్లులు ఎలా డ్రా చేస్తామని బుధవారం ఉదయం చెప్పారు. తిరిగి సాయంత్రం డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ గతేడాది లాస్ట్ క్వార్టర్‌లో భోజనం పెట్టామని చెప్పారు. భోజనం వడ్డించలేదని ఉదయం చెప్పారు కదా అని ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ‘కొద్దిమేర పెట్టాం. కొద్దిమేర పెట్టలేదు’ అని పొంతనలేని సమాధానం ఇచ్చారు.
డీసీహెచ్‌ఎస్ ఏమన్నారంటే..
భోజనానికి సంబంధించి తమ వద్ద బిల్లులు పెండింగ్‌లో లేవని, ఇటీవల మంజూరు చేశామని డీసీహెచ్‌ఎస్ రమేశ్‌నాథ్ చెప్పారు. రెండేళ్లుగా అక్కడ భోజనం వడ్డించలేదు.. అలాంటప్పుడు బిల్లులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించగా.. విషయం ఆరా తీసి మళ్లీ ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ విషయంపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.