సమ్మె విరమించిన హౌస్సర్జన్లు
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 20వ తేదీ నుంచి సమ్మె చేస్తున్న హౌస్సర్జన్లు శుక్రవారం సమ్మె విరమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. శనివారం నుంచి హౌస్సర్జను విధుల్లో ఉంటారన్నారు. గత పదిరోజులు హౌస్సర్జన్లు ఇంజెక్షన్లు చేయకుండా సమ్మె చేయటంతో నర్సులు, నర్సింగ్ విద్యార్థులతో ఇంజెక్షన్లు చేయిస్తున్నారు. గతంలో ఇలా నర్సింగ్ విద్యార్థిని ఇంజెక్షన్ చేయటంతో ఆస్పత్రి పిల్లల విభాగంలో బాలుడు చనిపోయాడు. ఇంజెక్షన్లు వైద్యులు చేయాల్సి ఉన్నా వారు చేయకుండా మిన్నకుండి పోవటంతో మరలా నర్సులు చేస్తున్న దష్ట్యా ఏదైనా చెడు సంఘటన చోటు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని విమర్శనాత్మకంగా ‘రోగుల ప్రాణాలతో చెలగాటం! శీర్షికతో శుక్రవారం సాక్షి జిల్లా ఎడిషన్లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి హౌస్సర్జన్ల సంఘం నేతలతో చర్చించి ఇంజెక్షన్లు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. హౌస్సర్జన్లు ఇంజెక్షన్లు చేసే సమయంలో నర్శింగ్ విద్యార్ధులు సహాయం చేస్తారని తెలిపారు.