ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. లలితాబాగ్ రైల్వే బ్రిడ్జి సరస్వతీనగర్ ప్రాంతానికి చెందిన ఉమా శంకర్, స్వప్న (30)లు దంపతులు. పదేళ్ల క్రితం వివాహమైన వీరికి కార్తీక్ (7), నాగ సంతోషి (3)లు సంతానం ఉన్నారు. కాగా ఇంట్లో నెలకొన్న సమస్యలతో బుధవారం ఉదయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పిల్లలతో సహా స్వప్న బయటికి వెళ్లింది.
తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు స్వప్న గ్రీన్ కలర్ చీర ధరించగా... కార్తీక్ రెడ్ కలర్ డ్రెస్సు, నాగ సంతోషి ఎల్లో కలర్ డ్రెస్సు ధరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854798, 7382296497, 9490616534 నంబర్లలో సమాచారం అందించాలన్నారు.