32 నెలలు రూ 33 కోట్లు !
► అభివృద్ధి ఖర్చు కాదు... అమాత్యుల వాయువిహారం
► సీఎంతో పాటు మంత్రుల విమానయానం వ్యయం వెల్లడైన వాస్తవాలు
సాక్షి, బెంగళూరు : 32 నెలలు... రూ. 33 కోట్లు ఇదేదో రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే... కరువు, తాగునీటి కష్టాలు, పశుగ్రాసం కొరత... రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంటే అమాత్యుల విమానయాన ఖర్చు ఇది. 32 నెలల్లో అక్షరాలా 33 కోట్ల రూపాయల ఖర్చు, కేవలం సీఎంతో పాటు ఆయన మంత్రివర్గంలోని అమాత్యుల వాయు విహారానికి అయిన ఖర్చే అక్షరాలా రూ.33.15 కోట్లు. బెళగావికి చెందిన ఆర్టీఐ కార్యకర్త భీమప్ప గుండప్ప సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 మే 2013 నుంచి 31జనవరి 2016 వరకు ముఖ్యమంత్రితో సహా ఆయన మంత్రి వర్గ సహచరులు చేసిన విమానయాన ఖర్చులను భీమప్ప గుండప్ప సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. కాగా, ఈ 32 నెలల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రుల విమాన ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.15 కోట్లు వెచ్చించగా అందులో అధిక వాటా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యదే. సీఎం సిద్ధరామయ్య ఒక్కరే రూ.20,11,34,971 ఖర్చు చేశారు. ఇక సీఎం తరువాతి స్థానంలో అధికంగా విమానయాన ప్రయాణాలకు ఖర్చు చేసిన వారిలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే ఉన్నారు. ఈ 32నెలల వ్యవధిలో ఆర్.వి.దేశ్‌పాండే మొత్తం 45.04 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
ఇదే సందర్భంలో విమానయాన ప్రయాణాల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసిన అమాత్యుల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఆర్.వి.దేశ్‌పాండేతో పాటు గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ (రూ.39,91,965), రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామనాథ్ రై (రూ.33,50,722), రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్(రూ.20,06,213), రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అభయ్‌చంద్ర జైన్(రూ.19,10,387)లు ఉన్నారు. ఇక విమానయానం కోసం అత్యంత తక్కువగా ఖర్చు చేసిన రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప (రూ.2,26,019) ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నార