ఇందుమూలముగా యావన్మందికీ..
బర్గర్ తినడానికి మన దగ్గర ఏముండాలి? జేబులో పైసలుండాలి బస్.. ఇంకేముండాలి? బ్రిటన్‌లోని హోవ్ పట్టణంలో ఉన్న బర్గర్ ఆఫ్ రెస్టారెంట్లో హాట్ చిల్లీ బర్గర్ కొనడానికి మాత్రం పైసలుంటే చాలదు. దాన్ని తినగలిగే ఖలేజా ఉండాలి. ముందు మన వయసు 18 దాటి ఉండాలి. తినబోయే ముందు రెస్టారెంట్ వారిచ్చే న్యాయపరమైన పత్రాలపై సంతకం చేసుండాలి.
అప్పుడే దాన్ని మనం తినగలం. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన బర్గర్. దీన్ని తిని ఓ ఐదుగురు వినియోగదారులు ఆస్పత్రి పాలవడంతో పిల్లలకు అమ్మడాన్ని నిషేధించడంతోపాటు కొన్ని నెలల నుంచి న్యాయపరమైన పత్రాలపై సంతకాలు తీసుకోవడం మొదలెట్టారు. ఇంతకీ ఆ పత్రాల్లో ఏముంటుందో తెలుసా? ఈ బర్గర్ చాలా ఘాటుగా ఉంటుందని తెలిసే మనం తింటున్నామని.. దాని వల్ల మనకేదైనా అయితే.. రెస్టారెంట్ వారికి సంబంధం లేదని.. వారిని పరిహారం కోరుతూ ఎలాంటి దావాలూ వేయమని చెబుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటివరకూ 3 వేల మంది ఈ బర్గర్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. వీరిలో 59 మంది మాత్రమే పూర్తిగా తిన్నారు. వారు కూడా రెస్టారెంట్ మొత్తం అదిరిపోయేలా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టినవారే.. కొందరైతే గోడలకు తలలు బాదుకోవడం.. నన్ను క్షమించండి అంటూ బోరున రోదించడం.. వాంతులు చేసుకోవడం వంటివి చేశారట. రెండు ముక్కలు తిని.. రెండ్రోజులు బెడ్‌రెస్ట్ తీసుకున్నవారూ ఉన్నారట.
అయినా.. ఎందుకు దీన్ని తయారుచేస్తున్నారు అని రెస్టారెంట్ యజమానిని అడిగితే.. వినియోగదారులే దీన్ని తయారుచేయమంటున్నారని.. ఈ బర్గర్‌కు తెగ డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఇంతకీ దీని ఘాటు స్థాయి ఎంతో తెలుసా? ఉదాహరణకు.. సాధారణ చిల్లీ బర్గర్లో ఘాటు స్థాయి 500 పాయింట్లు అనుకుంటే.. దీని ఘాటు స్థాయి 92 లక్షల పాయింట్లన్నమాట! దీని రేటు రూ.400.