పాకిస్థాన్ పోలీసులు.. చేదు నిజాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పోలీసులు సాగిస్తున్న అరాచకాలకు సంబంధించిన చేదు నిజాలు వెల్లడయ్యాయి. పాక్ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఓ ప్రపంచ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. పేద ప్రజలు, మైనార్టీలు, శరణార్థులపై హింస, అక్రమ అరెస్టులు, హత్యలు, లైంగిక హింసకు పాల్పడుతున్నారని పేర్కొంది. బలూచిస్తాన్, పంజాబ్ , సింధ్ ప్రావిన్స్‌లలో సీనియర్ పోలీసు అధికారులు, బాధితులను ఇంటర్వ్యూ చేసిన హ్యూమన్ రైట్స్ వాచ్, ఇందుకు సంబంధించి 102 పేజీల నివేదిక రూపొందించింది.
కస్టడీలో ఉన్న వారిని దర్యాప్తు సమయంలో పోలీసులు ఎక్కువగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. కేసుల విచారణ, ఫోరెన్సిక్ విశ్లేషణలో పోలీసులకు సరైన శిక్షణ ఇవ్వడంలేదని.. రాజకీయ నాయకులు, స్థానిక ఉన్నత వర్గాల ఒత్తిడుల వల్లే పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని సీనియర్ అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. 2015లో పోలీసులు 2,000 నకిలీ ఎన్కౌంటర్లు చేశారన్న సంస్థ.. పోలీసు వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది.