అశోక్‌బాబుకు మతిభ్రమించింది
- స్వలాభం కోసమే సెక్షన్-8 జపం
- హెచ్‌టీఎన్‌జీవోస్ నేత సత్యనారాయణ ధ్వజం
- ఇరు రాష్ట్రాల ఉద్యోగులు సఖ్యతగా ఉన్నారని వెల్లడి
కాచిగూడ: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట సీమాంధ్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్‌బాబుకు మతిభ్రమించిందని, అందుకే అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సత్యనారాయణగౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం నారాయణగూడలో హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి పి.బలరామ్, కేశియానాయక్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే బదులు, హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో తెలంగాణ ఉద్యోగులందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా, అక్కా చెల్లెళ్ల మాదిరిగా పనిచేస్తున్నామని, హైదరాబాద్ విషయాన్ని హైదరాబాద్‌లో తేల్చకుండా సీమాంధ్రలో సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనమేంటని వారు ప్రశ్నించారు.
నగరంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరూ ఆశోక్‌బాబుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆశోక్‌బాబు చేస్తున్న అసత్యపు ప్రకటనలు చూసి మోసపోయే స్థితిలో ఏవరూ లేరని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో వంద కోట్లు రూపాయలు దండుకుని అక్కడి ప్రజలకు, ఉద్యోగులకు తీరని ద్రోహం చేసి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆవే కోట్ల రూపాయలతో రాజకీయ నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలోకి దిగి అక్కడి ఉద్యోగులను, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
స్వలాభాల కోసం రెచ్చగొట్టే నాయకుల వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులు కలిసి మెలిసి జీవిస్తున్నారని తెలిపారు. ఆశోక్‌బాబు లాంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో హెచ్‌టీఎన్‌జీవోస్ నేతలు జి.మల్లారెడ్డి, ఎంఆర్ డేవిడ్‌రాజు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.