Hubli passenger train
-
ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ వస్తు రవాణా కోసం ఉంచిన పార్శిల్ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు. -
హుబ్లీ ప్యాసింజర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, గుంటూరు: హుబ్లీ ప్యాసింజర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వరద ఉద్ధతికి ట్రాక్ దెబ్బతిన్నట్టు గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం ఉదయం నల్లపాడు- పేరేచర్ల మార్గంలో కొండల పైనుంచి పొలాల్లోకి ప్రవహిస్తున్న వరద నీటి తీవ్రతకు రైల్వేట్రాక్ కింద ఉన్న కట్ట కోతకు గురైంది. ఉదయం పది గంటల సమయంలో విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆ ప్రదేశానికి రాగానే వరద నీరు ప్రవహించడాన్ని డ్రైవర్ బి.ఉదయభాస్కర్, అసిస్టెంట్ డ్రైవర్ శేఖర్‌బాబులు గుర్తించి, వెంటనే రైలును నిలిపివేశారు. రైలు దిగి వెళ్లి చూడగా కింద ఎలాంటి సపోర్టు లేకుండా సిమెంటు దిమ్మెలతో పట్టాలు గాలిలో తేలియాడుతున్నాయి. దీంతో రైలును అక్కడి నుంచి వెనక్కి నడుపుకుంటూ దగ్గర్లో ఉన్న నల్లపాడు రైల్వేస్టేషన్‌కు తరలించారు. అధికారులు దెబ్బతిన్న ట్రాక్‌ను మధ్యాహ్నం 12.30 గంటల కల్లా మరమ్మతులు చేయించి, రైళ్లను నడిపించారు. అప్రమత్తతతో వ్యవహరించిన డ్రైవర్లకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.