hublot watch
-
మంత్రి గిఫ్ట్ ను తిరస్కరించిన ముఖ్యమంత్రి
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కానుకలంటే హడలిపోతున్నారు. గతంలో హోబ్లేట్ వాచ్ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి...అనంతరం ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఏ. మంజు మంగళవారం విధాన సౌధలో సిద్ధరామయ్యకు ఓ గిఫ్ట్ ప్యాక్‌ను అందజేశారు. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్ జుబ్బాలు ఉన్నాయని స్వీకరించాలని కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో సిద్ధూకు క్లీన్ చిట్ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు. -
లోకాయుక్తకు రిస్ట్ వాచీ ట్విస్ట్ !
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే అత్యంత ఖరీదైన ‘హ్యూబ్లోట్’ వాచ్ వ్యవహారం లోకాయుక్తకు చేరింది. రూ.50-70లక్షల విలువ చేసే వాచ్‌ను సీఎం సిద్ధరామయ్య తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్‌ను దాఖలు చేశారంటూ మానవ హక్కుల రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సీఎం ధరించే ఈ అత్యంత ఖరీదైన వాచ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా రామమూర్తి గౌడ లోకాయుక్తను కోరారు. ఇంత ఖరీదైన వాచ్‌కు సంబంధించిన వివరాలను 2015 మార్చి 31లో లోకాయుక్తకు అందజేసిన నివేదికలో పొందుపరచలేదు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి విలువైన ఏ వస్తువును కొన్నా, లేదా ఆయనకు బహుమతిగా లభించినా అందుకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. కానీ ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలు గత నివేదికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొందుపరచలేదు. ఇక లోకాయుక్తకు సీఎం సిద్ధరామయ్య అందజేసిన వివరాల ప్రకారం సీఎం సిద్ధరామయ్యకు వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. వివిధ ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు ఇచ్చిన కట్టడాలకు బాడుగ రూపంలో ఏడాదికి రూ. 38 లక్షల ఆదాయం లభిస్తుండగా, భార్య పార్వతి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు ఏడాదకి రూ.1.25 లక్షల ఆదాయం వస్తోంది. ఇక ఈ నివేదికను సమర్పించే నాటికి ఇద్దరు కుమారులతో ఉన్న ఉమ్మడి కుటుంబానికి వ్యవసాయం ద్వారా ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తున్నట్లు వివరించారు.