వైజాగ్ వన్డే జరిగేనా?
విశాఖపట్నం: ఈ నెల 14న విశాఖపట్నంలో వెస్టిండీస్-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. 12వ తేదీన తుపాన్ తీరం దాటుతుందనే వార్తలు ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారుల్లో ఆందోళన పెంచాయి. అయితే 14వ తేదీ ఒక్క రోజు వర్షం లేకపోయినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని ధీమాగా ఉన్నారు. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది.
ఎంత పెద్ద వర్షం, ఎన్ని రోజుల పాటు వర్షం పడినా... ఆ రోజు రెండు గంటల పాటు సమయం దొరికితే మేం స్టేడియంను మ్యాచ్ కోసం సిద్ధం చేస్తాం’ అని ఏసీఏ మీడియా ఆపరేషన్స్ అధికారి సి.ఆర్.మోహన్ చెప్పారు. మూడో వన్డేకు సంబంధించిన టికెట్ల అమ్మకం శుక్రవారం నుంచి జరుగుతుంది. విశాఖలో మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ టికెట్లు కొనుక్కోవచ్చు. స్టేడియం సామర్థ్యం 27,500 కాగా... 12 వేల టికెట్లను అమ్మకానికి ఉంచారు.
నాలుగో వన్డే ఇస్తారా?
ధర్మశాలలో నాలుగో వన్డే నిర్వహించలేకపోతే ఆ మ్యాచ్‌ను కూడా విశాఖపట్నంలో జరిపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకవేళ అవకాశం వస్తే రెండు వన్డేలు నిర్వహించగల సామర్ధ్యం తమకు ఉందని ఏసీఏ చెబుతోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నాలుగో వన్డేను కూడా నగరానికి కే టాయిస్తే... పొరపాటున వర్షం కారణంగా మూడో వన్డే రద్దయినా నగర ప్రేక్షకులు మరో మ్యాచ్ చూడొచ్చు.