Hudood storm effect
-
క్షీరం.. భారం
లీటరుకు రూ.8 వరకూ పెంచిన వ్యాపారులు ‘హుదూద్’ దెబ్బకు తగ్గిన పాల ప్యాకెట్ల ఉత్పత్తి దానికి తోడు రోజూ వేల లీటర్లు విశాఖకు తరలింపు సాక్షి, రాజమండ్రి :ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన హుదూద్ తుపాను ప్రభావం కొంతమేర జిల్లాపైనా పడుతోంది. జిల్లాలో పాడిపంటలకు అంతగా నష్టం కలిగించని తుపాను ఇప్పుడు పాల కొరతకు, తద్వారా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రెండురోజులుగా జిల్లాలో పలుచోట్ల పాల ప్యాకెట్లవిక్రేతలు లీటరుకు రూ.ఐదు నుంచి రూ.ఎనిమిది వరకు పెంచి అమ్ముతున్నారు. జిల్లాలో ప్యాకెట్ల రూపంలో అమ్ముడయ్యే పాలలో 80 శాతం విశాఖ డెయిరీ నుంచే వస్తాయి. విశాఖ పరిసరాల్లోని ఈ డెయిరీ విశాఖపట్నం నుంచి రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం మార్గాల్లో సుమారు 99 బల్క్ కూలింగ్ కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తుంది. వాటిని ప్యాకెట్లుగా మార్చి మూడు జిల్లాల్లోని 56 రూట్లలో రవాణా చేస్తుంది. తుపానుతో వీటిలో 30 రూట్లు దెబ్బ తిన్నాయి. రోజుకు అయిదు లక్షల అరలీటరు ప్యాకెట్లను తయారు చేసే విశాఖ డెయిరీలో తుపానుతో 60 శాతం ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రోజుకు 40 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాలసేకరణ 40 శాతం వరకూ నిలిచి పోయింది. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటు పలు ప్రధాన పట్టణాలకు విశాఖ డెయిరీ నుంచి పాల ప్యాకెట్లు సరఫరా అవుతుంటాయి. విశాఖ డెయిరీ ఉత్పత్తి చేసే పాల ప్యాకెట్లలో ఎక్కువ భాగం ఇప్పుడు తుపాను కారణంగా కకావికలమైన విశాఖలోని బాధితుల కోసం తరలిస్తున్నారు. ఈ అన్ని కారణాలతో జిల్లాకు వచ్చే ప్యాకెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి తోడు పలు సంస్థలు, దాతలు జిల్లాలో విశాఖ డెయిరీతో పాటు ఇతర డెయిరీల పాల ప్యాకెట్లను సేకరించి విశాఖ బాధితులకు పంపుతున్నారు. దీంతో జిల్లాలో పాలకు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరను పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. మరింత పెరిగే అవకాశం సాధారణంగా జిల్లాలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే పాలు రిటైల్ మార్కెట్కు రావు. ఇందులో ఎక్కువ భాగం హార్లిక్స్, అమూల్ తదితర పాల ఉత్పత్తుల కంపెనీలు సేకరిస్తాయి. మిగిలినవి నేరుగా వినియోగదారుల ఇళ్లకు లేదా డెయిరీల సేకరణ కేంద్రాలకు చేరుతుంది. దీంతో పాల ప్యాకెట్ల కోసం వినియోగదారులు విశాఖ డెయిరీ లేదా ఇతర డెయిరీలపై ఆధారపడుతున్నారు. జిల్లాలో లభించే పాల ప్యాకెట్లతో పాటు నిల్వ చేసుకోదగ్గ పాల ప్యాకెట్లనూ వేల సంఖ్యలో దాతలు కొనుగోలు చేసి విశాఖకు పంపిస్తుండడంతో మంగళవారం నుంచి స్థానిక అవసరాలకు సరిపడా పాలు దొరకడం లేదు. ప్రస్తుతం రూ.అయిదు నుంచి రూ.ఎనిమిది వరకూ పెంచి అమ్ముతున్నా.. విశాఖలో సాధారణ పరిస్థితి నెలకొనేలోగా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
గండం గడిచినా గుండెల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే.. జిల్లాపై హుదూద్ తుపాను ప్రభావం బాగా తక్కువేనని చెప్పాలి. వరుస విపత్తులతో పంట ను నష్టపోవడం రివాజుగా మారిన రైతులను హుదూద్ విరుచుకుపడనుందన్న వార్తలు కలవరపరిచాయి. ఇప్పుడు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు పంటలకు తుపాను కలిగించిన తీవ్రనష్టాన్ని చూశాక ఆ విపత్తు నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డామని సంతోషిస్తున్నారు. అదే దెబ్బను హుదూద్ జిల్లాను తీసి ఉంటే కోలుకోలేని విధంగా నష్టపోయే వారమని నిట్టూరుస్తున్నారు. అందుకు కారణం వేళ్లపై అతితక్కువ మంది రైతులు మినహా మిగిలిన వారికి పంటల బీమా రక్షణ కవచం లేకపోవడమే. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల రైతాంగం మన జిల్లా రైతుల మాదిరిగానే రుణమాఫీని నమ్ముకుని రుణాల రెన్యువల్, బీమా ప్రీమియంలను విస్మరించారు. ఇప్పుడు ఆ జిల్లాల రైతులు పంటలను కోల్పోయి బీమా రక్షణ లేని స్థితిలో లబోదిబోమంటున్నారు. వారిని చూసిన జిల్లా రైతులు హుదూద్ తమను కనికరించిందనుకుంటున్నా.. పంట చేతికి వచ్చేలోపు మరో గండం ఎదురు కాకూడదని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నాశనమైనా.. బీమా చేయించి ఉంటే రైతులకు ధీమా కలుగుతుంది. జిల్లాలోని 293 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 90 వేల మంది రైతులు సుమారు రూ.900 కోట్ల వరకూ పంట రుణాలు పొందారు. వీరంతా రుణాలను సెప్టెంబరు నెలాఖరులోపు రెన్యువల్(బుక్ అడ్జస్ట్మెంట్) చేయించుకుంటారు. ఈ ప్రక్రియ తర్వాత మళ్లీ కొత్త రుణం తీసుకోవడం పరిపాటి. అలా తీసుకున్న మొత్తంలో ఆరు శాతం పంటల బీమా ప్రీమియంగా చెల్లిస్తారు. ఆ ప్రీమియమే ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బ తిన్నప్పుడు పరిహారం రూపంలో రైతన్నకు దన్నుగా నిలుస్తుంది. మాఫీకి అనర్హులవుతామని... టీడీపీ రుణమాఫీ హామీతో రైతులు సెప్టెంబరు నెలాఖరు వరకు రుణాలను రెన్యువల్ చేయించుకోలేదు. రుణం చెల్లిస్తే మాఫీ లబ్ధిని కోల్పోతామేమోన్న భయంతో అధిక శాతం రైతులు రుణాల రెన్యువల్, బీమా ప్రీమియం జోలికి వెళ్లలేదు. దీంతో అటు రుణం చెల్లించక, ఇటు కొత్త రుణం పొందక, బీమా ప్రీమియం చెల్లించకుండా ప్రైవేట్ అప్పులతో సాగుకు ఉద్యుక్తులయ్యారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా పంట రుణాలు తీసుకున్న 90 వేల మంది రైతుల్లో 50 వేల మందికి పైగా రుణాలు రెన్యువల్ చేయించుకోక, బీమా ప్రీమియం చెల్లించక బీమా రక్షణకు దూరమయ్యారని డీసీసీబీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. సాధారణంగా సెప్టెంబరు మొదటి వారం లోపు బీమా ప్రీమియం రైతులు చెల్లించాలి. రుణమాఫీ ఆశతో ఎవరూ ముందుకు రాక ప్రభుత్వం గడువును గత సెప్టెంబరు 15 వరకూ పెంచింది. ఈ లోగా మాఫీపై ఆశ పోయిన కొందరు రైతులు రుణాలు రెన్యూవల్ చేయించుకున్నారు. అయితే అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని సహకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.