క్షీరం.. భారం
లీటరుకు రూ.8 వరకూ పెంచిన వ్యాపారులు
‘హుదూద్’ దెబ్బకు తగ్గిన పాల ప్యాకెట్ల ఉత్పత్తి
దానికి తోడు రోజూ వేల లీటర్లు విశాఖకు తరలింపు
సాక్షి, రాజమండ్రి :ఉత్తరాంధ్రపై విరుచుకుపడిన హుదూద్ తుపాను ప్రభావం కొంతమేర జిల్లాపైనా పడుతోంది. జిల్లాలో పాడిపంటలకు అంతగా నష్టం కలిగించని తుపాను ఇప్పుడు పాల కొరతకు, తద్వారా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రెండురోజులుగా జిల్లాలో పలుచోట్ల పాల ప్యాకెట్లవిక్రేతలు లీటరుకు రూ.ఐదు నుంచి రూ.ఎనిమిది వరకు పెంచి అమ్ముతున్నారు. జిల్లాలో ప్యాకెట్ల రూపంలో అమ్ముడయ్యే పాలలో 80 శాతం విశాఖ డెయిరీ నుంచే వస్తాయి. విశాఖ పరిసరాల్లోని ఈ డెయిరీ విశాఖపట్నం నుంచి రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం మార్గాల్లో సుమారు 99 బల్క్ కూలింగ్ కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తుంది. వాటిని ప్యాకెట్లుగా మార్చి మూడు జిల్లాల్లోని 56 రూట్లలో రవాణా చేస్తుంది. తుపానుతో వీటిలో 30 రూట్లు దెబ్బ తిన్నాయి.
రోజుకు అయిదు లక్షల అరలీటరు ప్యాకెట్లను తయారు చేసే విశాఖ డెయిరీలో తుపానుతో 60 శాతం ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రోజుకు 40 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాలసేకరణ 40 శాతం వరకూ నిలిచి పోయింది. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటు పలు ప్రధాన పట్టణాలకు విశాఖ డెయిరీ నుంచి పాల ప్యాకెట్లు సరఫరా అవుతుంటాయి. విశాఖ డెయిరీ ఉత్పత్తి చేసే పాల ప్యాకెట్లలో ఎక్కువ భాగం ఇప్పుడు తుపాను కారణంగా కకావికలమైన విశాఖలోని బాధితుల కోసం తరలిస్తున్నారు. ఈ అన్ని కారణాలతో జిల్లాకు వచ్చే ప్యాకెట్ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి తోడు పలు సంస్థలు, దాతలు జిల్లాలో విశాఖ డెయిరీతో పాటు ఇతర డెయిరీల పాల ప్యాకెట్లను సేకరించి విశాఖ బాధితులకు పంపుతున్నారు. దీంతో జిల్లాలో పాలకు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరను పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు.
మరింత పెరిగే అవకాశం
సాధారణంగా జిల్లాలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే పాలు రిటైల్ మార్కెట్‌కు రావు. ఇందులో ఎక్కువ భాగం హార్లిక్స్, అమూల్ తదితర పాల ఉత్పత్తుల కంపెనీలు సేకరిస్తాయి. మిగిలినవి నేరుగా వినియోగదారుల ఇళ్లకు లేదా డెయిరీల సేకరణ కేంద్రాలకు చేరుతుంది. దీంతో పాల ప్యాకెట్ల కోసం వినియోగదారులు విశాఖ డెయిరీ లేదా ఇతర డెయిరీలపై ఆధారపడుతున్నారు. జిల్లాలో లభించే పాల ప్యాకెట్లతో పాటు నిల్వ చేసుకోదగ్గ పాల ప్యాకెట్లనూ వేల సంఖ్యలో దాతలు కొనుగోలు చేసి విశాఖకు పంపిస్తుండడంతో మంగళవారం నుంచి స్థానిక అవసరాలకు సరిపడా పాలు దొరకడం లేదు. ప్రస్తుతం రూ.అయిదు నుంచి రూ.ఎనిమిది వరకూ పెంచి అమ్ముతున్నా.. విశాఖలో సాధారణ పరిస్థితి నెలకొనేలోగా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.