సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే.. జిల్లాపై హుదూద్ తుపాను ప్రభావం బాగా తక్కువేనని చెప్పాలి. వరుస విపత్తులతో పంట ను నష్టపోవడం రివాజుగా మారిన రైతులను హుదూద్ విరుచుకుపడనుందన్న వార్తలు కలవరపరిచాయి. ఇప్పుడు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు పంటలకు తుపాను కలిగించిన తీవ్రనష్టాన్ని చూశాక ఆ విపత్తు నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డామని సంతోషిస్తున్నారు. అదే దెబ్బను హుదూద్ జిల్లాను తీసి ఉంటే కోలుకోలేని విధంగా నష్టపోయే వారమని నిట్టూరుస్తున్నారు. అందుకు కారణం వేళ్లపై అతితక్కువ మంది రైతులు మినహా మిగిలిన వారికి పంటల బీమా రక్షణ కవచం లేకపోవడమే. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల రైతాంగం మన జిల్లా రైతుల మాదిరిగానే రుణమాఫీని నమ్ముకుని రుణాల రెన్యువల్, బీమా ప్రీమియంలను విస్మరించారు.
ఇప్పుడు ఆ జిల్లాల రైతులు పంటలను కోల్పోయి బీమా రక్షణ లేని స్థితిలో లబోదిబోమంటున్నారు. వారిని చూసిన జిల్లా రైతులు హుదూద్ తమను కనికరించిందనుకుంటున్నా.. పంట చేతికి వచ్చేలోపు మరో గండం ఎదురు కాకూడదని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నాశనమైనా.. బీమా చేయించి ఉంటే రైతులకు ధీమా కలుగుతుంది. జిల్లాలోని 293 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 90 వేల మంది రైతులు సుమారు రూ.900 కోట్ల వరకూ పంట రుణాలు పొందారు. వీరంతా రుణాలను సెప్టెంబరు నెలాఖరులోపు రెన్యువల్(బుక్ అడ్జస్ట్‌మెంట్) చేయించుకుంటారు. ఈ ప్రక్రియ తర్వాత మళ్లీ కొత్త రుణం తీసుకోవడం పరిపాటి. అలా తీసుకున్న మొత్తంలో ఆరు శాతం పంటల బీమా ప్రీమియంగా చెల్లిస్తారు. ఆ ప్రీమియమే ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బ తిన్నప్పుడు పరిహారం రూపంలో రైతన్నకు దన్నుగా నిలుస్తుంది.
మాఫీకి అనర్హులవుతామని...
టీడీపీ రుణమాఫీ హామీతో రైతులు సెప్టెంబరు నెలాఖరు వరకు రుణాలను రెన్యువల్ చేయించుకోలేదు. రుణం చెల్లిస్తే మాఫీ లబ్ధిని కోల్పోతామేమోన్న భయంతో అధిక శాతం రైతులు రుణాల రెన్యువల్, బీమా ప్రీమియం జోలికి వెళ్లలేదు. దీంతో అటు రుణం చెల్లించక, ఇటు కొత్త రుణం పొందక, బీమా ప్రీమియం చెల్లించకుండా ప్రైవేట్ అప్పులతో సాగుకు ఉద్యుక్తులయ్యారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా పంట రుణాలు తీసుకున్న 90 వేల మంది రైతుల్లో 50 వేల మందికి పైగా రుణాలు రెన్యువల్ చేయించుకోక, బీమా ప్రీమియం చెల్లించక బీమా రక్షణకు దూరమయ్యారని డీసీసీబీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. సాధారణంగా సెప్టెంబరు మొదటి వారం లోపు బీమా ప్రీమియం రైతులు చెల్లించాలి. రుణమాఫీ ఆశతో ఎవరూ ముందుకు రాక ప్రభుత్వం గడువును గత సెప్టెంబరు 15 వరకూ పెంచింది. ఈ లోగా మాఫీపై ఆశ పోయిన కొందరు రైతులు రుణాలు రెన్యూవల్ చేయించుకున్నారు. అయితే అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని సహకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
గండం గడిచినా గుండెల్లో గుబులు
Published Thu, Oct 16 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM
Advertisement