హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్.. భారీ నగదు లభ్యం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశంలోని చాలా ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెద్ద మొత్తాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి ప్రతిరోజు భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజా పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్‌లోనూ కనిపించింది. నగరంలో పోలీసుల ముమ్మర తనిఖీలలో భాగంగా గురువారం రాత్రి దాదాపు కోటి రూపాయల నగదు లభ్యమైంది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
నగరంలోని నారాయణగూడలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. కొందరు అనుమానిత వ్యక్తులతో పాటు వారు ప్రయాణిస్తున్న వాహనాలను పరిశీలించారు. ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి రూ.95 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యక్తులు, రామంతపూర్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 శాతం కమిషన్ పేరుతో కమీషన్ మార్పిడికి రాగా తమ తనిఖీలలో ఈ నగదు లభ్యమైందని పోలీసులు వివరించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తుల వద్ద లభ్యమైన నగదులో కొత్త వెయ్యి రూపాయల నోట్లు ఎక్కువ మొత్తంలో ఉండగా, వంద రూపాయల నోట్లు, కొన్ని రద్దు చేసిన పాత నోట్లు ఉన్నట్లు సమాచారం. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.