ఓ.. మై గాడ్
⇒1,135 ఎకరాల భూమి మాయం
⇒ఆలయాల భూములు అన్యాక్రాంతం
⇒సన్నూరు, మడికొండలో భారీ ఆక్రమణలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయుల రాజధాని వరంగల్ జిల్లా విభిన్న కళా సంపదతో నిర్మించిన ఆలయాలకు ప్రసిద్ధి. కాకతీయలు, వారికి ముందు పాలకులు, ఆ తర్వాత కీలక స్థానాల్లో ఉన్న వారు జిల్లాలో ఎన్నో ఆలయాలను నిర్మించారు. నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేందుకు మాన్యాలుగా వేల ఎకరాల భూములను సైతం ఆలయాలకు కేటాయించారు. భూములకు డిమాండ్ పెరగడం... దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో జిల్లాలోని ఆలయ భూములు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. దేవుడి పేరిట ఉన్న భూములు ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులుగా మారిపోయాయి.
వరంగల్ జిల్లాలో మొత్తం 814 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 298 ఆలయాలకు మాన్యాలు(ఆస్తులు)గా 4783.16 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో 1,135 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. నగరం, నగర శివారులోని ఆలయాల భూములదీ ఇదే పరిస్థితి. ఆలయ భూముల పరిరక్షణ కోసం రెండేళ్ల క్రితం అధికారులు చొరవ చూపారు. 230 ఆలయాలకు చెందిన 3,663 ఎకరాలనుఆలయాల ఆస్తులుగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు.
ఆ తర్వాత ఉన్నతాధికారులు మారిపోవడంతో ఆలయ భూముల పరిరక్షణ చర్యలు అగిపోయూయి. ఈ క్రమంలో ఆలయాల భూములను పరిరక్షిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని దేవాదాయ శాఖ భూముల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పరిశీలనల అనంతరం జిల్లాలోని ఆలయాల భూములపై దేవాదాయ శాఖ ఇటీవల నివేదిక రూపొందించింది. ఇందులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.
దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం..
⇒రాయపర్తి మండలం సన్నూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 782.23 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ తాజా నివేదిక ప్రకారం 692.31 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. 600 ఏళ్ల క్రితం ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. గతంలో రెండో తిరుపతిగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు దాతల విరాళాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
⇒హన్మకొండ మండలం మడికొండలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి 466.20 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ నివేదిక ప్రకారం 417.29 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. గతంలో ఆస్తులతో ఓ వెలుగు వెలిగిన ఇక్కడి ఆలయానికి ఇప్పుడు 40 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఉంది.
⇒వరంగల్ నగర పరిధిలోని రామన్నపేటలో శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి 10 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు మొత్తం భూమి కబ్జాకు గురైందని, 16, 17, 18, 20 సర్వే నంబర్లలో ఈ భూమి ఉందని దేవాదాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
⇒వరంగల్రంగంపేటలోని శ్రీహనుమాన్ ఆలయానికి 728, 730 సర్వే నంబర్లలో 5.38 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరమైందని దేవాదాయ శాఖ రికార్డులే చెబుతున్నాయి.
⇒రామన్నపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 3, 4, 11, 12 సర్వే నంబర్లలో 5.06 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 4.30 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురైందని దేవాదాయ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నారుు.
⇒ఖిలా వరంగల్లోని శ్రీస్వయంభువు శంభులింగేశ్వరస్వామి ఆలయానికి 2072 సర్వే నంబరులో 3.09 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ నివేదిక ప్రకారం 33 గుంటల భూమి కబ్జాకు గురైంది.
⇒మట్టెవాడలోని శ్రీవేణగోపాలస్వామి ఆలయానికి 499 సర్వే నంబరులో 4.21 ఎకరాల భూములున్నాయి. ఇందులో నాలుగు గుంటల భూమి కబ్జాకు గురైనట్లు రికార్డులు చెబుతున్నాయి.