‘సూరజ్‌కుండ్’ తరహాలో నగరంలో మేళా
- అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమాలోచన
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతిపెద్ద మేళాగా గుర్తింపు పొందిన ‘సూరజ్‌కుండ్’ తరహాలో హైదరాబాద్‌లో కూడా భారీ మేళా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రాష్ట్రాలను ఆహ్వానించి త్వరలోనే మేళా నిర్వహించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యాటక శాఖ అధికారులతో ఢిల్లీలో సమాలోచనలు జరిపారు. ఆదివారం ఆయన సూరజ్‌కుండ్ మేళాను సందర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులతో కలసి ఆయన అక్కడి ప్రదర్శనలను వీక్షించారు.
ఈసారి థీమ్ స్టేట్ హోదాలో తెలంగాణ రాష్ట్రం పాల్గొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర ప్రతినిధులకు సంప్రదాయరీతిలో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రం తరఫున ఏర్పాటైన అప్నాఘర్, ఐటీ హబ్, కాకతీయ తోరణం తదితరాలను వారు పరిశీలించారు.
తెలంగాణ సంప్రదాయ కళారీతులను మన కళాకారులు ప్రదర్శించారు. తెలంగాణకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో... హైదరాబాద్‌లో కూడా సూరజ్‌కుండ్ తరహా మేళాను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాజీవ్‌శర్మ అధికారులతో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ప్రదర్శనలో భాగంగా నీటి ధారలో ‘తెలంగాణ’ అక్షరాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ అక్కడి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.