70 ఇయర్స్ ఇండస్ ‘ట్రీ’
ఆ దారి వెంట వెళ్తే చాలు... గొడుగు పట్టినట్టు నీడ పరచుకుంటుంది. పచ్చని పసరు వాసన శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది. చల్లని గాలి ఒళ్లంతా పెనవేసుకుంటుంది. ఆహ్లాదకరమైన అనుభవం ఆనందాన్ని మిగులుస్తుంది. ఆ ఘనత శాఖోపశాఖలుగా విస్తరించిన కొన్ని మహావృక్షాలకు దక్కుతుంది. డెబ్భయ్యేళ్ల క్రితం నాటిన మొక్కలు వటవృక్షాలుగా ఎదిగాయి. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి.
కొయ్యలగూడెం మీదుగా ప్రయాణించే వారికి నడిబొడ్డున ప్రధాన సెంటర్ను ఆనుకున్న సువిశాల ప్రాంతంలో విస్తరించిన వటవృక్షం కనిపిస్తుంది. రూ.కోట్ల విలువైన పోలీస్ స్టేషన్ మైదానంలో ఈ భారీ వృక్షం సహా ఇతర వృక్షాలు పచ్చదనంతో పరవశింపజేస్తున్నాయి. ప్రస్తుతం కొయ్యలగూడెంలో ప్రధాన కేంద్రాలైన చెక్పోస్ట్, గణేష్ సెంటర్ల మధ్య నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ స్టేషన్ ఉంది. దీని వెనుకే మహావృక్షాలుగా ఎదిగిన మర్రి, వేప, గానుగ, రావిచెట్లు ఉన్నాయి. వీటి వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది.
ఈ ప్రాంతానికి చెందిన వృద్ధుడు కొల్లూరు పండు గెరటయ్య అందించిన వివరాల ప్రకారం 1945-46 మధ్యకాలంలో మన్యంలో పెద్దపులిని వేటాడిన ఓ కోయదొరను గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేటాడిన పులిని, కోయదొరను అప్పటి జమిందారు ఎర్ర గెరటయ్య ఎద్దుల బండిపై వెంట తీసుకొచ్చారు. పులిని చూసిన ఎద్దులు కాడి వదిలి పరుగు తీశాయి. దీంతో ఎడ్ల కళ్లకు గంతలు కట్టి బండిపై పులిని వేసుకుని ప్రస్తుతం చెట్లున్న ప్రాంతంలో ప్రదర్శించారు.
ఆ సమయంలో ప్రస్తుతం కొయ్యలగూడెం అభివృద్ధి చెందకపోవడంతో నిర్మానుష్యంగా ఉండేది. ప్రస్తుత పోలీస్ స్టేషన్ను పోలవరం రోడ్లోని మాటూరి పంచాక్షరికి చెందిన పెంకుటింట్లో నిర్వహించేవారు. పెద్దపులిని వేటాడినట్టు తెలిసిసమీప గ్రామాల్లోని వందలాది ప్రజలు చూట్టానికి వచ్చారు. అది తెలిసిన అప్పటి బ్రిటిష్ కలెక్టర్ కొయ్యలగూడెంను సందర్శించారు. రెండ్రోజుల తర్వాత కోయదొరను జమిందార్లు ఘనంగా సన్మానించారు.
ఇందుకు గుర్తుగా బ్రిటిష్ కలెక్టర్, జమిందార్లయిన కొల్లూరు ఎర్ర గెరటయ్య, కొల్లూరు వెంకటరత్నం, అంకాలగూడెం మునసబు గంటా జానకి రామయ్య, కన్నాపురానికి చెందిన గెడా గెరటయ్య ఈ మొక్కల్ని నాటారు. మొక్కలు నాటే ఆనవాయితీని సుమారు 70 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అందించారన్నమాట.
- కొయ్యలగూడెం