రెవె‘న్యూ’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రెవిన్యూ డివిజన్ల మార్పు జిల్లాలో చిచ్చు రేపింది. హుస్నాబాద్‌కు బదులుగా హుజూరాబాద్‌ను రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా పేరిట సోమవారం జీవో నెం.18 విడుదలైంది. హుజూరాబాద్, కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి మండలాలతో హుజూరాబాద్ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది.
ఆరు నెలల ముందు.. ఫిబ్రవరి 19న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో నెం.235 జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు కరీంనగర్ డివిజన్ పరిధిలో ఉన్న హుస్నాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్, భీవుదేవరపల్లి, చిగురువూమిడి, కోహెడ, కవులాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక వుండలాలతో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆవిర్భవించింది. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలు... వరుస ఎన్నికలతో గెజిట్ జారీ చేసే ప్రక్రియ ఆగిపోయింది.
ఆర్డీవో ఆఫీసు ఏర్పాటు.. ఆర్డీవో నియామకం.. తదితర కార్యాచరణ ప్రక్రియలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రవీణ్‌రెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకున్న దోస్తానాతో సొంత నియోజకవర్గంలో డివిజన్ కేంద్రం ఉండేలా ఉత్తర్వులు తీసుకొచ్చినట్లు రాజకీయంగా చర్చ జరిగింది. భౌగోళికంగా.. రవాణా సదుపాయాలు పరిగణనలోకి తీసుకుంటే ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు హుజూరాబాద్‌ను డివిజన్ కేంద్రంగా మార్చాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్థానికంగా ఆందోళనలు తలపెట్టింది.
దొంగదారిన జీవోను తెచ్చుకున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక ఆ జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అప్పుడే కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. డివిజన్‌ను సాధించకుంటే తాను ప్రజలకు ముఖమే చూపించబోనంటూ చెప్పారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత జీవోను రద్దు చేసింది. హుస్నాబాద్ ప్రాంత వాసులు కలలు కన్న రెవెన్యూ డివిజన్ కేంద్రం అమలుకు నోచుకోకుండానే చెదిరిపోయినట్లయింది. దీంతో స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి.
ఇది సరైంది కాదు : మాజీ ఎంపీ పొన్నం
హుజురాబాద్... హుస్నాబాద్ రెండింటినీ రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌ను డివిజన్ కేంద్రంగా మార్చాలని ఎప్పటినుంచో తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని.. అందుకు హుస్నాబాద్ డివిజన్‌ను పణంగా పెట్టడం సరైంది కాదని అన్నారు. అధికారంలోకి ఎవరొస్తే వారి ఇష్టమైతే.. అధికారులు పంపిన ప్రతిపాదనలకు విలువ లేదా...? అని ప్రశ్నించారు.