అంతరాలుంటే అభివృద్ధి ఎక్కడ?
కొత్త కోణం
అధికారం వెలగబెట్టిన అన్ని పార్టీలు ఆధిపత్య కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కింది కులాలను, దళితులను, ఆదివాసులను, మైనారిటీలను అన్ని కులాల్లోని మహిళలను కనీసం మనుషులుగా కూడా పరిగణించని పరిస్థితి మన సమాజంలో కనిపిస్తున్నది. స్వాతంత్య్ర పోరాటం సమయంలో రాజకీయ విప్లవాన్ని ఆశించిన వాళ్లకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆరోజే ఒక స్పష్టతనిచ్చారు. భారతదేశంలో ఏదైనా విప్లవం సంభవించాలంటే ముందుగా సామాజిక విప్లవం రాకుండా రాజకీయార్థికాభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించి ఏడు దశాబ్దాలు పూర్తికా వచ్చింది. ఇంతవరకు పరిపాలించిన నేతలంతా ఈ దేశం ప్రగతి మార్గంలో పయనిస్తోందని నమ్మబలికారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశాన్ని అభివృద్ధిపథంలో దూసుకుపోయేలా చేస్తా మంటూ గత పాలకుల మాటలనే మరోరూపంలో వల్లెవేస్తోంది. మన దేశం నిజంగా గొప్పగా ఉంటే ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఎవ్వరికీ అభ్యం తరం ఉండదు. ఉండకూడదు. కానీ దేని ద్వారా అభివృద్ధిని అంచనా వేస్తు న్నారన్నది మౌలిక ప్రశ్న. ఇటీవలి కాలంలో ఆ మేరకు అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. ఐక్య రాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక, 2012 సంవ త్సరం నుంచి మానవాభివృద్ధి సూచికను విస్తృతపరిచే ప్రపంచ సంతోష సూచిక నివేదికలు అలాంటివే. మహిళల అభివృద్ధిని అంతర్జాతీయంగా అధ్య యనం చేస్తూ, వారి అభివృద్ధిలోని అంతరాలను గుర్తించి నివేదిస్తున్నాయి. ఈ మూడింటిలో కూడా భారతదేశం ఆశించిన స్థాయిలో ప్రగతిని సాధించలే దని నివేదికలన్నీ ఘోషిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచిక అధ్యయన పరి ధిలో ఉన్న 188 దేశాలలో మనది 130వ స్థానం. 2015లో 157 దేశాలలో అధ్యయనం చేసిన తరువాత విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ నివేదికలో మనది 118వ స్థానం. అలాగే మహిళల అభివృద్ధి అంతరాల సూచికలో 87వ స్థానం. మానవాభివృద్ధి సూచికలో శ్రీలంక, ఇరాన్, ఇరాక్, తజకిస్తాన్, నమీబియా లాంటి దేశాలు కూడా ముందు వరుసలో నిలిచిన విషయం గమనార్హం.
అభివృద్ధి సూచీలలో చిట్టచివర
మానవాభివృద్ధిలో తలసరి ఆదాయం, విద్య, సగటు ఆయుర్దాయం అంశా లను పరిగణనలోనికి తీసుకుని ర్యాంక్‌లను నిర్ణయిస్తారు. హ్యాపీనెస్ రిపో ర్టులో విద్య, వైద్యం, సహజవనరులపై హక్కు, స్వేచ్ఛ, భాగస్వామ్యం, మానవ భద్రత, సంపదలో సమాన వాటా, నిలకడకలిగిన ప్రగతి అనే అంశా లను పరిగణనలోనికి తీసుకుంటున్నారు. మహిళల ప్రగతిలో అంతరా లకు సంబంధించిన నివేదికకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో భాగస్వామ్యం అక్షరా స్యత, ఆరోగ్యం, రాజకీయ ప్రాతినిధ్యం లాంటి అంశాలను కీలకంగా తీసు కుంటారు. 2016 నాటి ఈ అధ్యయనాలు దేశాన్ని ఎక్కడికో నెట్టివేశాయి.
కనీస విద్య, వైద్యం, భద్రత భాగస్వామ్యం లాంటి అంశాలలో భారత దేశం మెరుగుదల సాధించకపోవడానికి కారణాల గురించి ఆ నివేదికలు వెల్ల డించలేదు. కానీ దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ నిర్మాణం ఆ అంతరాలకు ఆస్కారమిస్తున్నది. మన సామాజిక నిర్మాణంలో 16 శాతం అంటరాని కులాలుగా ఉన్న ఎస్సీలు, దాదాపు 9 శాతంగా ఉన్న ఎస్టీలు, ఈ దేశంలో ఇప్పటికీ భాగం కాలేకపోతోన్న, అనుక్షణం అభద్రతలో కొట్టుమిట్టాడుతోన్న ముస్లింలు 13 శాతం. ఇతర మైనారిటీలు 4 శాతం. ఎస్సీ, ఎస్టీ ముస్లింలతో సహా మైనారిటీలంతా కలిపితే దాదాపు 40 శాతం ఉంటారు. వీరందరి అ భివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. మిగతా సమాజం 60 శాతమనుకుంటే, అందులో సగం–30 శాతం మహిళలు. మన దేశంలో ఉన్న సంస్కృతి, సంప్ర దాయాలు వారిని అన్ని రంగాల్లో రెండవ పౌరులుగానే చూస్తున్నాయి. ఇక మిగిలిన 30 శాతంలో మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది. ఇందులో కూడా వెనుకబడిన కులాల్లో కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చెప్పుకోదగిన మార్పు లేదు. అభివృద్ధి అంతా జనాభాలో 15 నుంచి 20 శాతం ఉన్న ఆధి పత్య కులాలు, ఇతర కులాల్లో ఎదిగిన ధనిక, మధ్య తరగతి వారి అభివృద్ధే.
2004లో అధికారంలోనికి వచ్చిన యునైటñ డ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యుపి ఏ–1) ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులపై నియమించిన అర్జున్ సేన్ గుప్తా కమిటీ నివేదిక దేశం ఆర్థిక స్థితిగతులకు అద్దం పడు తున్నది. ఆ నివేదిక ప్రకారం, దేశంలోని దాదాపు 80 శాతం మంది ఒక రోజు ఆదాయం, ఖర్చు రూ. 25. అంటే ఒక కుంటుంబం సరాసరి రోజువారీ ఖర్చు, ఆదాయం రూ. 100. కాబట్టి నెల ఆదాయం ఖర్చు రూ. 3,000. ఇంకా చెప్పాలంటే దాదాపు 80 శాతం మంది ప్రజలు విద్య, వైద్య రంగాల్లో నాణ్యమైన వసతులను పొందలేకపోతున్నారు. ప్రభుత్వ అధీనంలో ఉండా ల్సిన సేవారంగం కొద్దికొద్దిగా ప్రైవేటీకరణ గుప్పిట్లోకి పోతోంది. ప్రధా నంగా విద్య, వైద్య రంగాలు 80 శాతం మంది ప్రజలకు గగన కుసుమాలే. ప్రైవేటీకరణ ఫలితమిది. పేరుకు ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతోన్న పాఠ శాలలు, వైద్యశాలలు సరిౖయెన ఫలితాలను అందించడంలేదు. అందువల్ల కూడా పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అరకొర చదువులతో, ఉపాధి దొరకని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. దీనితో ప్రపంచ స్థాయిలో జరుగుతున్న అధ్యయనాలు వెల్లడిస్తున్న నివేదికల్లో మన దేశంపేరుని అభివృద్ధి చిట్టాలో చిట్టచివరి నుంచే వెతుక్కోవాల్సిన పరిస్థితి. మన అభివృద్ధి ప్రపంచ దేశాల ముందు తలవంపులు తెచ్చేదే. పలు సామాజిక వర్గాలు విద్యలో వెనుకబడి పోవడం వల్లనే అక్షరాస్యతకు సంబంధించి ప్రపంచ పటంలో మనం 130వ స్థానంలో ఉండిపోయాం.
విద్యలో, వైద్యంలో వెనుకబాటే
వరుసగా ఈ సామాజిక వర్గాల అక్షరాస్యత స్థితిని పరిశీలిద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత 73 శాతం. అందులో పురుషులు 80 శాతం, మహిళలు 64 శాతం. ఎస్సీలు 66 శాతం– ఇందులో పురుషులు 75 శాతం. మహిళలు 56 శాతం. ఎస్టీలు మొత్తం 59 శాతం కాగా, పురుషులు 68 శాతం, మహిళలు 49 శాతం. ముస్లింల అక్షరాస్యత శాతం 59 కాగా, పురుషులు 67 శాతం. మహిళలు 50 శాతం కనిపిస్తున్నది. దేశం మొత్తం అక్షరాస్యత శాతంతో పోలిస్తే మిగతా వర్గాలు అంతకన్నా చాలా తక్కువగా అక్షరాస్యతను కలిగి ఉన్నాయి. దీనివల్ల ఈ వర్గాల్లో చైతన్యం కొరవడుతు న్నది. ఉద్యోగావకాశాలపై దీని ప్రభావం ఉంది. ఈ వర్గాలలో హైస్కూల్ స్థాయిని దాటిన వారు కేవలం 20 నుంచి 25 శాతం. ఇక విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న వారి సంఖ్య 3 శాతానికి మించడం లేదు.
వైద్యం కూడా పలు కోణాల నుంచిlదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తు న్నది. ప్రభుత్వ రంగంలో వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. గ్రామాల్లో ఉన్న దళితులు, అడవుల్లో ఉండే ఆదివాసీలు, పట్టణాల్లో ఉండే ముస్లింలు, అట్టడుగు వెనుకబడిన కులాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవు తున్నారు. ఈ వర్గాల సగటు ఆయుర్దాయం దేశ సగటు 70 కన్నా చాలా తక్కువ. ఈ సగటు ఎస్సీలలో 64 శాతం, ఎస్టీలలో 60 శాతం, ముస్లింలలో 67 శాతం. వెనుకబడిన కులాల్లో 66 సంవత్సరాల సగటు ఆయుర్దాయం ఉంటుంది. సగటు ఆయుర్దాయంలో (89 సంవత్సరాలు) ప్రథమ స్థానంలో ఉన్న దేశం మొనాకో. జపాన్ సగటు ఆయుర్దాయం 84.6 సంవత్సరాలు. సింగపూర్ సగటు ఆయుర్దాయం 84.4 సంవత్సరాలు. దేశంలో సగటు ఆయుర్దాయం పెరగకపోవడానికి ఆరోగ్య రక్షణకు పూచీ లేకపోవడంతో పాటు, పౌష్టికాహార లోపం కూడా ప్రధాన కారణమే. ఆరోగ్య సమస్యలు ఏర్పడినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇటీవల ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఆదివాసీ పిల్లలు మెదడువాపు వ్యాధితో పిట్టల్లా రాలిపోతుంటే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నాయి. రెండు నెలల కాలంలో 300 మందికి పైగా పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపో యాయి. ఈ దేశంలో నేరమయ నిర్లక్ష్యం రాజ్యమేలుతుందనడానికి ఉదాహ రణ ఇదే. మాతా శిశు మరణాల రేటు కూడా ఎస్సీ, ఎస్టీలలో చాలా ఎక్కువ.
జీవనభద్రత గగన కుసుమమే
మరొక ముఖ్యమైన అంశం జీవన భద్రత. ఇది ఈ దేశంలో చాలా పెద్ద మాట. ప్రతి ఏటా దళితులు, ఆదివాసీలు, మహిళలపై పెరుగుతున్న అత్యా చారాల సంఖ్య చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. దళితు లపై అత్యాచారాల వివరాలను చూస్తే, 2010లో 32, 643 జరిగితే, 2014లో ఆ సంఖ్య 40,300 కు పెరిగింది. అంటే 23 శాతం పెరిగాయి. 2010లో దళిత మహిళలపై అత్యాచారాలు 1,350 జరిగితే 2014లో 2,233 జరిగాయి. అంటే 65 శాతం పెరిగాయి. హత్యలు 2010లో 572 జరగగా, 2014లో 704కు పెరి గాయి. అంటే 23.07 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. 2010లో మొత్తం మహిళలపై జరిగిన అన్ని రకాల దాడులు, అత్యాచారాల సంఖ్య 2,13,585గా నమోదైతే, 2014కు ఆ సంఖ్య 3,37,922కు చేరింది. మహిళలపై జరిగిన కేవలం అత్యాచారాలే 2010లో 22,172గా రికార్డు అయితే 2014లో 36,735 మంది అత్యాచారానికి గురయ్యారు. రోజూ కనీసం వందమంది మహిళలు దేశంలో అత్యాచారాలకు బలౌతున్నారు.
ఇలాగైతే పురోగతి సాధ్యమా?
విద్య, వైద్యం, జీవన భద్రత, రక్షణలు కొరవడటం వల్లనే భారతదేశం మిగతా దేశాల ముందు తల దించుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడు తున్నది. ఈ విషయాలు కేవలం దేశ ఆర్థికాభివృద్ధి మీద మాత్రమే ఆధారపడి లేవు. ఈ దేశంలో అసమానతలకు నెలవైన కుల సమాజం మనుషులను విడగొట్టి, ఒకరిపైన ఒకరికి ప్రేమ, గౌరవం లేకుండా చేస్తున్నది. 70 ఏళ్లు అధికారం వెలగబెట్టిన అన్ని రాజకీయ పార్టీలు ఆధిపత్య కులాలకు ప్రాతి నిధ్యం వహిస్తూ కింది కులాలను, దళితులను, ఆదివాసులను, ముస్లిం మైనారిటీలను అన్ని కులాల్లోని మహిళలను కనీసం మనుషులుగా కూడా పరిగణించని పరిస్థితి మన సమాజంలో కనిపిస్తున్నది. స్వాతంత్య్ర పోరాటం సమయంలో రాజకీయ విప్లవాన్ని ఆశించిన వాళ్లకు బాబాసాహెబ్ అంబే డ్కర్ ఆరోజే ఒక స్పష్టతనిచ్చారు. భారతదేశంలో ఏదైనా విప్లవం సంభవిం చాలంటే ముందుగా సామాజిక విప్లవం రాకుండా రాజకీయార్థికాభివృద్ధి సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. భారతదేశం ప్రపంచంలో అగ్రగా మిగా నిలబడాలంటే వివక్షకు గురవుతున్న దళితులు, ఆదివాసీలు, మైనా రిటీలు, మహిళలు, ఇతర అన్ని వర్గాల పట్ల అధికారంలో ఉన్న పార్టీలు ఆధి పత్యంలో ఉన్న కులాలు తమ మనస్తత్వాలను మార్చుకోవాలి. ఈ దేశంలో మనుషులంతా సమానమనే భావన రాకుండా ఈ దేశ పురోగమనం సాధ్యం కాదు. ప్రపంచాభివృద్ధిలో మనమెన్నటికీ భాగం కాలేము.
(వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 )