Human Hair
-
ఐదేళ్లలో 370 మిలియన్ డాలర్ల జుట్టు ఎగుమతి
ఢిల్లీ: భారతదేశం నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22 లో 149.07 డాలర్లు, 2022-23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు తెలిపారు. మానవ జుట్టు, జుట్టు ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జుట్టు (ముడి సరుకు) లభించేది భారతదేశంలోనే అని అన్నారు. అలాగే భారత్ లో లభించే జుట్టు అత్యంత నాణ్యమైనదిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరయ్యేందుకు సంబంధిత పరిశ్రమలతో కలిసి ప్లెక్స్ కౌన్సిల్ చురుకుగా పనిచేస్తోందని, జుట్టుతో విగ్గులు వంటి విలువైన వస్తువులు ఉత్పత్తి చేసేందుకు ఎగుమతిదారులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇటీవల ప్లెక్స్ కౌన్సిల్ నిర్వహించిన అతిపెద్ద బ్యూటీ షో "కాస్మోప్రోఫ్ వరల్డ్‌వైడ్ బోలోగ్నా 2023"లో ఇండియా నుంచి జుట్టు ఉత్పాదనలు చేసే పరిశ్రమలకు చెందిన 20 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రపంచదేశాల కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. 2024లో నిర్వహించనున్న ప్రదర్శనలో ప్లెక్స్ కౌన్సిల్ ఇదే స్ఫూర్తితో పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మయన్మార్ ద్వారా చైనాకు భారతీయ జుట్టు అక్రమ రవాణా జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కస్టమ్స్ శాఖ వద్జ ఎటువంటి కేసులూ నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. -
విజయవాడ: రికార్డు స్థాయిలో తలనీలాల ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే తలనీలాలకు రికార్డు ధర పలికింది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఏడాదిపాటు తలనీలాలు సేకరించుకునేందుకు రూ.7,15,99,999 చెల్లిస్తామని తమిళనాడుకు చెందిన కేఎం ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. గత ఏడాది రూ.5.67 కోట్లు పలికిన టెండర్ ఈ దఫా రూ.7.16 కోట్లకు చేరింది. దీంతో నిరుటికంటే రూ.1.49 కోట్ల మేర ఆలయానికి అధికంగా ఆదాయం సమకూరింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన తలనీలాలను పోగుచేసుకునే హక్కుకోసం ఆలయ అధికారులు టెండర్ ప్రక్రియను నిర్వహించారు. బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్ విధానాల ద్వారా టెండర్లు ఆహ్వానించారు. దుర్గగుడి పరిపాలన భవనంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం పదిమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ టెండర్ దేవదాయశాఖ కమిషనర్ ఆమోదం పొందిన 72 గంటల్లోనే కేఎం ఇండస్ట్రీస్ ఆ మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియను దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి, పాలకమండలి సభ్యులు బాల, సుజాత పర్యవేక్షించారు. (చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది?) -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
పంట పండింది
పెరట్లో నాటిన చెట్ల పాదుల్లో ఉల్లిపాయ తొక్కలు కనిపిస్తుంటాయి. కోడిగుడ్డు డొల్లలను పొడి చేసి వేస్తారు. కూరగాయలు తరిగినప్పుడు వచ్చిన తొడిమలు, తొక్కలు కూడా వేయవచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కర్ణాటక అమ్మాయిలు కొత్తరకం ఎరువును కనిపెట్టారు. ఈ ఎరువు కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు.. దువ్వెనలోని చిక్కు వెంట్రుకలను మొక్కలకు ఎరువుగా వేయవచ్చని చెప్తున్నారు ఖుషీ అంగోల్కర్, రమణికా యాదవ్. వీళ్లిద్దరూ బెలగావిలోని కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుతున్నారు. నాలుగు నెలల ప్రయోగం ఖుషీ, రమణికల ప్రయోగం ఒక రోజు గాజు బీకరులో వేస్తే వారం రోజుల్లో ఫలితాలనిచ్చేది కాదు. ఫలితాలను ఆచరణాత్మకంగా చూపించాలి. ఇందుకోసం ఖుషీ, రమణిక ‘బెంగళూరులోని ఐసీఎమ్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌లోని ప్రయోగక్షేత్రంలో నాలుగు నెలల పాటు టమాటా, క్యాబేజ్, చిల్లీ, పాలకూర నాటారు. ఒక్కొక్క మడి రెండు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పుతో మొత్తం 24 మడులు చేశారు. సగం మడులలో సంప్రదాయ విధానంలో సాగు చేశారు. మిగిలిన సగంలో వీళ్లు తయారు చేసిన వెంట్రుకల ఎరువును వాడారు. ఒకటిన్నర నెలకు పంట కోతకు వచ్చింది. సంప్రదాయ విధానంలో పండించిన పాలకూర 1.7 కేజీలు తూగితే, వెంట్రుకల ఎరువుతో పండిన పాలకూర 2.3 కేజీలు తూగింది! ఖుషీ, రమణిక ఈ పరిశోధనలను సైంటిస్టులు శ్రీదేవి అంగడి, ప్రవీణ్ యడహల్లి ఆధ్వర్యంలో చేశారు. వెంట్రుకల నుంచి తయారైన ఆర్గానిక్ లిక్విడ్‌లో మొక్కల పెరుగుదలకు దోహదం చేసే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని నిరూపణ అయింది. ఈ విద్యార్థినులిద్దరూ ఇదే ప్రయోగాన్ని ఈ నెల 25వ తేదీన భోపాల్‌లో జరగనున్న జాతీయ స్థాయి కేంద్రీయ బాలల సైన్స్ పోటీలలో ప్రదర్శించనున్నారు. -
చైనాకు లక్ష కేజీల పాక్ కురులు
ఇస్లామాబాద్: చైనాకు గత ఐదేళ్లలో లక్ష కేజీలకు పైగా కురులను ఎగుమతి చేసినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఎగుమతి చేసిన మానవ వెంట్రుకల విలువ 132,000 డాలర్లకు పైగా ఉంటుందని తెలిపింది. గత ఐదు సంవత్సరాల్లో 105,461 కిలోల కురులను చైనాకు పంపినట్టు పాకిస్తాన్ వాణిజ్య, ఔళి మంత్రిత్వ శాఖ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేసిందని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. చైనాలో మేకప్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడంతో కురులకు డిమాండ్ పెరిగింది. విగ్గులు ధరించడం ఫ్యాషన్‌గా మారడం కూడా వెంట్రుకలకు డిమాండ్ పెరగడానికి కారణమని ప్రముఖ బ్యుటీషియన్ ఏఎం చౌహన్ తెలిపారు. స్థానికంగా కురులకు డిమాండ్ తగ్గిపోవడం చైనాకు ఎగుమతులు పెరగడానికి మరో కారణమని వివరించారు. ఎగుమతిదారులు లోకల్ సెలూన్ల నుంచి నాణ్యమైన కురులను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అత్యంత నాణ్యమైన కురులను అమెరికా, జపాన్ దేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. ఇదే సమయంలో హెయిర్ ఎక్స్టెన్షన్లు, విగ్గులు పాకిస్తాన్‌కు దిగుమతి అవుతున్నాయన్నారు. -
తగ్గిన టీటీడీ తలనీలాల ఆదాయం
-
సిరులు కురిపిస్తున్న కురులు
తిరుమల: ఏడాదికి కోటి మందికిపైగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కురులు తిరుమలేశునికి సిరులు కురిపిస్తున్నాయి. ఈ-వేలం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఏడు విడతల్లో 1,472 టన్నుల తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 540 కోట్లు ఆదాయం సమకూరింది. ఏడాదికి కోటిమందికి పైగా తలనీలాలు తిరుమలలో రెండు ప్రధాన కల్యాణకట్టలతోపాటు కాటేజీలు, అతిథి గృహాలు,యాత్రికుల వసతి సముదాయాల వద్ద 18 చిన్నవి ఉన్నాయి. సాధారణ రోజుల్లో 30 వేలు, రద్దీ రోజుల్లో 45 వేలకు పైబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. నెలకు సరాసరి 9 లక్షలు, ఏడాదికి కోటీ ఎనిమిది లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. గతంలో సాధారణ టెండర్ ప్రక్రియలో దేశీయంగానే తల నీలాలవిక్రయం ద్వారా టీటీడీకి ఏడాదికి రూ.80 కోట్లలోపే ఆదాయం లభించేది. మనుషుల తల వెంట్రుకలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నట్లు గుర్తించిన టీటీడీ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు టెండర్ల ప్రక్రి యలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మెటీరియల్ స్క్రాబ్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) సహకారంతో ‘ఈ -వేలం’ ద్వారా అంతర్జాతీయస్థాయిలో కొనుగోలుదారులను ఆహ్వానించి తలనీలాలు విక్రయించడంతో ఆదాయం మూడు రెట్లు పెరిగింది. విభజనలో శాస్త్రీయత పాటించడం వల్లే ఆదాయం భక్తులు సమర్పించిన తలనీలాలు సేకరించడం నుంచి విక్రయించేవరకు కచ్చితమైన నిబంధనలు పాటించడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం పొడవు వెంట్రుకలను వేరు చేయడం వల్లే సుమారు రూ.30 కోట్ల దాకా ఆదాయం అదనంగా లభించడం విశేషం. తిరుమలతోపాటు తిరుపతిలోనూ తలనీలాలను భద్రపరిచేందుకు అవసరమైన కొత్త గోడౌన్లను నిర్మించనున్నారు. మార్కెట్ విశ్లేషణకు ప్రత్యేక కమిటీ అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ ఉన్న తలవెంట్రుకలను విక్రయించే విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలని ఈవో ఎంజీ గోపాల్ సంకల్పించారు. ఇందుకోసం మార్కెట్ విశ్లేషణకు నిపుణులతో కమిటీ వేసేందుకు ఎంఎస్టీసీ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. తల వెంట్రుకలను ఏనెలలో ఈ-వేలం వేయడం వల్ల టీటీడీకి లాభదాయకంగా ఉంటుందనే విషయంలో కమిటీ నిర్ణయించేలా చర్యలు తీసుకున్నారు. త్వరలోనే ఈ కమిటీ నియామకం కానుంది.