సిరులు కురిపిస్తున్న కురులు | Tirumala temple earns nearly Rs.540 crore from auctioning human hair | Sakshi
Sakshi News home page

సిరులు కురిపిస్తున్న కురులు

Published Sun, Sep 29 2013 9:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

సిరులు కురిపిస్తున్న కురులు

సిరులు కురిపిస్తున్న కురులు

తిరుమల: ఏడాదికి కోటి మందికిపైగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కురులు తిరుమలేశునికి సిరులు కురిపిస్తున్నాయి. ఈ-వేలం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఏడు విడతల్లో 1,472 టన్నుల తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 540 కోట్లు ఆదాయం సమకూరింది.

ఏడాదికి కోటిమందికి పైగా తలనీలాలు
తిరుమలలో రెండు ప్రధాన కల్యాణకట్టలతోపాటు కాటేజీలు, అతిథి గృహాలు,యాత్రికుల వసతి సముదాయాల వద్ద 18 చిన్నవి ఉన్నాయి. సాధారణ రోజుల్లో 30 వేలు, రద్దీ రోజుల్లో 45 వేలకు పైబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. నెలకు సరాసరి 9 లక్షలు, ఏడాదికి కోటీ ఎనిమిది లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. గతంలో సాధారణ టెండర్‌ ప్రక్రియలో దేశీయంగానే తల నీలాలవిక్రయం ద్వారా టీటీడీకి ఏడాదికి రూ.80 కోట్లలోపే ఆదాయం లభించేది.

మనుషుల తల వెంట్రుకలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్నట్లు గుర్తించిన టీటీడీ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు టెండర్ల ప్రక్రి యలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మెటీరియల్‌ స్క్రాబ్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎస్‌టీసీ) సహకారంతో ‘ఈ -వేలం’ ద్వారా అంతర్జాతీయస్థాయిలో కొనుగోలుదారులను ఆహ్వానించి తలనీలాలు విక్రయించడంతో ఆదాయం మూడు రెట్లు పెరిగింది.

విభజనలో శాస్త్రీయత పాటించడం వల్లే ఆదాయం
భక్తులు సమర్పించిన తలనీలాలు సేకరించడం నుంచి విక్రయించేవరకు కచ్చితమైన నిబంధనలు పాటించడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం పొడవు వెంట్రుకలను వేరు చేయడం వల్లే సుమారు రూ.30 కోట్ల దాకా ఆదాయం అదనంగా లభించడం విశేషం. తిరుమలతోపాటు తిరుపతిలోనూ తలనీలాలను భద్రపరిచేందుకు అవసరమైన కొత్త గోడౌన్లను నిర్మించనున్నారు.
 

మార్కెట్‌ విశ్లేషణకు ప్రత్యేక కమిటీ
అంతర్జాతీయస్థాయిలో డిమాండ్‌ ఉన్న తలవెంట్రుకలను విక్రయించే విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలని ఈవో ఎంజీ గోపాల్‌ సంకల్పించారు. ఇందుకోసం మార్కెట్‌ విశ్లేషణకు నిపుణులతో కమిటీ వేసేందుకు ఎంఎస్‌టీసీ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. తల వెంట్రుకలను ఏనెలలో ఈ-వేలం వేయడం వల్ల టీటీడీకి లాభదాయకంగా ఉంటుందనే విషయంలో కమిటీ నిర్ణయించేలా చర్యలు తీసుకున్నారు. త్వరలోనే ఈ కమిటీ నియామకం కానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement