పెరట్లో నాటిన చెట్ల పాదుల్లో ఉల్లిపాయ తొక్కలు కనిపిస్తుంటాయి. కోడిగుడ్డు డొల్లలను పొడి చేసి వేస్తారు. కూరగాయలు తరిగినప్పుడు వచ్చిన తొడిమలు, తొక్కలు కూడా వేయవచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కర్ణాటక అమ్మాయిలు కొత్తరకం ఎరువును కనిపెట్టారు. ఈ ఎరువు కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు.. దువ్వెనలోని చిక్కు వెంట్రుకలను మొక్కలకు ఎరువుగా వేయవచ్చని చెప్తున్నారు ఖుషీ అంగోల్కర్, రమణికా యాదవ్. వీళ్లిద్దరూ బెలగావిలోని కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుతున్నారు.
నాలుగు నెలల ప్రయోగం
ఖుషీ, రమణికల ప్రయోగం ఒక రోజు గాజు బీకరులో వేస్తే వారం రోజుల్లో ఫలితాలనిచ్చేది కాదు. ఫలితాలను ఆచరణాత్మకంగా చూపించాలి. ఇందుకోసం ఖుషీ, రమణిక ‘బెంగళూరులోని ఐసీఎమ్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌లోని ప్రయోగక్షేత్రంలో నాలుగు నెలల పాటు టమాటా, క్యాబేజ్, చిల్లీ, పాలకూర నాటారు. ఒక్కొక్క మడి రెండు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పుతో మొత్తం 24 మడులు చేశారు. సగం మడులలో సంప్రదాయ విధానంలో సాగు చేశారు. మిగిలిన సగంలో వీళ్లు తయారు చేసిన వెంట్రుకల ఎరువును వాడారు.
ఒకటిన్నర నెలకు పంట కోతకు వచ్చింది. సంప్రదాయ విధానంలో పండించిన పాలకూర 1.7 కేజీలు తూగితే, వెంట్రుకల ఎరువుతో పండిన పాలకూర 2.3 కేజీలు తూగింది! ఖుషీ, రమణిక ఈ పరిశోధనలను సైంటిస్టులు శ్రీదేవి అంగడి, ప్రవీణ్ యడహల్లి ఆధ్వర్యంలో చేశారు. వెంట్రుకల నుంచి తయారైన ఆర్గానిక్ లిక్విడ్‌లో మొక్కల పెరుగుదలకు దోహదం చేసే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని నిరూపణ అయింది. ఈ విద్యార్థినులిద్దరూ ఇదే ప్రయోగాన్ని ఈ నెల 25వ తేదీన భోపాల్‌లో జరగనున్న జాతీయ స్థాయి కేంద్రీయ బాలల సైన్స్ పోటీలలో ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment