రోడ్లతోపాటు మనసులను ప్రక్షాళన చేయండి
సంగడిగుంట (గుంటూరు): దేశాన్ని ప్రతి ఏడాదీ ఊడుస్తున్నారంటే మురికి పూర్తిగా తొలగించనట్లేనని దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు అన్నారు. రోడ్లతోపాటు మనుషుల మనస్సులను ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ సూత్రాలతోనే రాజ్యాంగాన్ని రచించారన్నారు. 6000 కులాలు అనేక మతాల, భాషల ప్రజలు సహజీవనం సాగిస్తూ దేశ జనాభా 125 కోట్లకు పెరిగింది అంబేద్కర్ రచించిన రాజ్యాంగంవల్లేనని చెప్పారు.
ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయులు బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్ మాత్రమేనన్నారు. మన దేశంలో ఏర్పాటు చేయనున్న 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం 200 దేశాల నుండి వచ్చే పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతుందన్నారు. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటోల సమ మేధావి అంబేద్కర్ అని, నోబెల శాంతి బహుమతి పొందాల్సిన మహోన్నతుడని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు భగవద్గీతకు బదులుగా భారత రాజ్యాంగాన్ని బహూకరించాల్సిందని చెప్పారు. హిందుత్వ శక్తులను ఐక్య పరచేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఐక్యపరచే సందేశాన్ని ఇస్తున్నామన్నారు.
11న బ్లూ మార్చ్: 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కార్యాచరణ ప్రణాళికను కత్తి పద్మారావు విడుదల చేశారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 11న గుంటూరు నీలం రంగు మయం కానుందని చెప్పారు. ఆ రోజు మార్చ్‌లో పాల్గొనే వారందరికీ భోజనం, నీలం రంగు బన్నీలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ఉద్యమ కాారులు, కులరహిత మేధావులు, సామాజిక స్పృహ ఉన్నవారందరూ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. మార్చ్ స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని మహాత్మా పూలే ప్రాంగణం వరకు జరుగుతుందని, అనంతరం అక్కడ సభతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.