టాప్ హీరోయిన్‌తో వీధి వ్యాపారి పోటీ
ఆమె దేశంలోనే టాప్ హీరోయిన్. అతను వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. జిల్ జిగేల్ మెరుపులు తోడవడంతో సహజంగానే హీరోయిన్ ముందంజలో ఉంది. బతుకుపోరులో వెనుకపడిపోయిన ఆ వృద్ధ వ్యాపారి.. తారను నేలకు దించి, వెలిగిపోగలడా?
నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి ఏమన్నారంటే..
'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పండ్లే మంచివి. కానీ ఇది వ్యాపారం. వ్యాపారమన్నాక పోటీ తప్పదు. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడది విచిత్రంగా మారిపోయింది. నా వరకైతే నా ప్రధాన పోటీదారు కత్రినా కైఫే. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం దొరుకుతుంది' అంటూ టాప్ హీరోయిన్ తో పోటీపడుతున్నట్లు వెల్లడిస్తాడు వీధి వ్యాపారి.