డీయూ విద్యార్థుల ఆందోళన
- మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట
- 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమీపంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిలో అత్యధిక శాతం మంది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) విభాగానికి చెందినవారే. ఈ విషయమై ఎస్ఓఎల్ కు చెందిన దినేశ్ వర్మ అనే విద్యార్థి ఒకరు మాట్లాడుతూ ‘ మొత్తం 20 తరగతులు ఉంటాయని మాకు ఇచ్చిన క ర్కిక్యులంలో ఉంది.
అయితే ఇప్పటిదాకా 13 తరగతులే జరిగాయి. పరీక్షలు సమీపిస్తున్నాయి. కోర్సు ఇంకా పూర్తికాలేదు. దీంతోపాటు అపరిషృ్కత సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని ఎస్ఓఎల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అనుమతి తీసుకోకుండానే ఆందోళనకు దిగారనే కారణంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల్లో 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోయినా తమను అదుపులోకి తీసుకున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. తమను నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. కాగా ఈ ఆందోళనకు క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ సారథ్యం వహించింది.