న్యాయ వ్యవస్థకు మనమే ఆదర్శం
సాక్షి, బెంగళూరు : మానవ హక్కుల సంబంధించిన కేసులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన వ్యాజ్యాల విషయంలో భారత న్యాయ వ్యవస్థ ఇస్తున్న తీర్పులు ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హెచ్.ఎన్ నాగమోహన్ దాస్ పేర్కొన్నారు.
అలియన్స్ యూనివర్శిటీ న్యాయ విభాగంలో ఆదివారం జరిగిన ఫ్రెషర్స్ పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... కొన్ని కేసులను వాదించే విషయంలో, తీర్పు సమయంలో సాక్ష్యాధారాల ఆధారంగానే కాకుండా మనసుతో కూడా ఆలోచించాలన్నారు. దీని వల్ల సామన్య ప్రజలకు న్యాయవ్యవస్థపై గౌరవం పెరుగుతుందన్నారు. న్యాయ విద్యను అభ్యసించే వారు పుస్తక పరిజ్ఞానంతో పాటు సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలను సూక్ష్మదృష్టితో పరిశీలించాలన్నారు. అప్పుడు మాత్రమే ఉత్తమ న్యాయనిపుణులుగా పేరు తెచ్చుకోవడానికి సాధ్యమవుతుందని సూచించారు.
ప్రస్తుతం బహుళ జాతీయ కంపెనీలు ఉత్తమ నైపుణ్యాలు కలిగిన న్యాయ విద్యార్థులకు లక్షల్లో వేతనాలు ఇచ్చి ఉద్యోగులుగా తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే మూడు నాలుగేళ్లుగా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, వీటిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగమోహన్ దాస్ విద్యార్థులకు సూచించారు.