కాలుష్య నివారణకు సోలార్ సైకిల్
పింప్రి, న్యూస్‌లైన్ : మానవ సేవా వికాస్ ట్రస్టు సౌరశక్తితో నడిచే సైకిల్‌కు శ్రీకారం చుట్టింది. నగర కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్‌ను తయారు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వృద్ధులు, మహిళలు, స్కూలు విద్యార్థులు, వికలాంగులు సులువుగా ఈ సైకిల్‌పై ప్రయాణించవచ్చు. కేవలం నాలుగు గంటల ఛార్జింగ్‌తో 20 నుంచి 25 కి.మీ. దూరాన్ని ప్రయాణించవచ్చు. సౌరశక్తిపై నగర ప్రజలకు అవగాహన కలిగించేందుకు గత రెండేళ్లుగా ఈ సంస్థ సోలార్ సైకిల్‌ను తయారు చేస్తోంది. కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో 2012లో మానవ సేవా వికాస్ ట్రస్టు ఏర్పడింది.
గ్రీన్ అండ్ క్లీన్ ప్రయాణం పేరిట ఈ-బైసైకిల్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సైకిల్లో 12 వోల్ట్ల శక్తిగల మూడు ఛార్జింగ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. నాలుగు గంటల పాటు వీటిని చార్జింగ్ చేస్తే 25 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. చార్జింగ్ అయిపోతే మామూలు సైకిల్లాగానే తొక్కుకుంటూ కూడా వెళ్లవచ్చని రూపకర్తలు పేర్కొన్నారు. అయితే 35 కిలోల బరువున్న ఒక్కో సైకిల్ వెల సుమారు రూ.20 వేల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. వికలాంగుల కోసం మూడు చక్రాలతో, మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సైకిల్‌ను తయారు చేశారు. పింప్రి-చించ్వడ్లో ప్రస్తుతం 15 సైకిల్లు నడుస్తున్నాయి.
ఈ-సైకిల్ ద్వారా ప్రతి రోజు సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ట్రస్టు అధ్యక్షులు సంతోష్ ఇంగలే తెలిపారు. ఈ సైకిల్ తయారీలో డిసిమోటర్, కంట్రోలర్, సోలార్ ఛార్జింగ్‌లు ఉన్నాయి. డిసిమోటర్ బెంగుళూరు నుంచి తీసుకురాగా, సౌరశక్తి ఛార్జింగ్ కోసం ప్యానెల్‌ను ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సైకిల్‌తో ధ్వని, వాయు కాలుష్యం జరగదు. సైకిల్ క్యారియర్, సీటు కింద బ్యాటరీని అమర్చారు. సంస్థ అధ్యక్షులు సంతోష్, ఉపాధ్యక్షులు వివేక్ కులకర్ణి, సునీల్ దేవ్‌లు సైకిల్ తయారీలో ముఖ్య పాత్ర పోషించారు.