భర్త తరచూ మందలిస్తున్నాడని...
హైదరాబాద్: భర్త తరచూ మందలిస్తున్నాడని ఓ గృహిణి మనస్త్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలకు గురైంది. ఈ సంఘటన హుమయూన్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఈశ్వరయ్య కథనం ప్రకారం... విజయనగర్కాలనీలో ఉండే బాబయ్య, పార్వతి(29)లకు గత 9 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఘర్షణ జరుగుతుంది.
తరచూ భర్త గొడవ పడుతూ తిట్టడాన్ని భరించలేక పార్వతి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భర్త బాబయ్య బుధవారం భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకు వచ్చిన వెంటనే ఇంటి ముందు బాబయ్య తన సమీప బంధువులతో భార్యను తిట్టుకుంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఇది విన్న భార్య పార్వతి ఇంట్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. దీంతో అక్కడే ఉన్న భర్త మంటలార్పి చికిత్స నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.