భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి
ఈ ఒక్క నిర్మాణం...
పది గ్రంథాలకు సమానం.
ఒక పూర్తి స్థాయి దృశ్యకావ్యం.
వందలాది జీవితాలకు దర్పణం.
భార్య ప్రేమకు నిదర్శనం.
హుమయూన్ సమాధి... ఢిల్లీ పర్యటనలో చాలా మంది మిస్సయ్యే ప్రధానమైన పర్యాటక ప్రదేశం. ఢిల్లీ టూర్ అనగానే ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో మొదలు పెట్టి, ఎర్రకోట, కుతుబ్‌మినార్, ఐరన్ పిల్లర్, ఇండియా గేట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్, జంతర్‌మంతర్, చాందినీ చౌక్, కన్నాట్ సర్కిల్, రాజ్‌ఘాట్, బిర్లాటెంపుల్, జమా మసీద్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్... అన్నీ కవర్ చేస్తారు. ఈ టూంబ్ గుర్తుకు వచ్చినా సరే... ‘అంతదూరం వెళ్లడం దేనికీ... ట్రైన్లో వెళ్లేటప్పుడు కనిపిస్తుంది. చూడవచ్చు’ అని తేల్చేస్తారు. ఇది మధుర రోడ్లో నిజాముద్దీన్ అనే ప్రదేశంలో ఉంది. ట్రైన్లో ఢిల్లీ స్టేషన్ చేరేలోపు కనిపిస్తుంది. ముందుగా తెలిస్తే తప్ప వెళ్లేటప్పుడు గమనించడం కుదరదు. తిరుగు ప్రయాణంలో గుర్తు పెట్టుకుని చూసినా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని పై అంతస్థును మాత్రమే చూడగలం. మనకు కనిపించని మరో అంతస్థు కూడా ఉన్నట్లు అప్పుడు తెలియదు కాబట్టి కనిపించినంతటితోనే సంతృప్తి చెందుతాం. కానీ... హుమయూన్ సమాధి కోసం కనీసం రెండు గంటల సమయం కేటాయించి చూస్తేనే నిర్మాణం గొప్పదనాన్ని, సునిశితమైన పనితనాన్ని ఆస్వాదించగలుగుతాం.
హుమయూన్ సమాధి ప్రాంగణం
భర్త కోసం
హుమయూన్ సమాధి నిర్మాణ కౌశలాన్ని స్వయంగా చూసిన తర్వాత తాజ్‌మహల్ వంటివన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి చూస్తే సమాధి నిర్మాణం సుదూర తీరాన ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది పేరుకి సమాధే కానీ ముప్పై ఎకరాల్లో విస్తరించిన కట్టడం. విశాలమైన తోటల నడుమ ఉంటుంది. మోకాళ్లకు శ్రమ తెలియకుండా ఆరంగుళాల మెట్లను ఎక్కడానికి అలవాటు పడిన వాళ్లకు ఈ మెట్లు ఎక్కడం కొంచెం కష్టమే. మొఘలులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నిర్మించిన పెద్ద కట్టడాల్లో ఇది ముఖ్యమైనది. హుమాయూన్ భార్య హాజీ బేగం పర్షియా నుంచి ఆర్కిటెక్టులను పిలిపించి మరీ కట్టించింది. ఈ సమాధి నిర్మాణం హుమయూన్ మరణించిన తొమ్మిదేళ్లకు క్రీ.శ 1565లో మొదలైంది. పూర్తవడానికి ఏడేళ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన మిరాక్ మీర్జా మరణించడంతో అతడి కొడుకు సయీద్ ముహమ్మద్ పూర్తి చేశాడు. మొఘలుల తొలి చార్భాగ్ సమాధి ఇది. చుట్టూ నాలుగు తోటలతో జామెట్రికల్ లే అవుట్‌తో డిజైన్ చేశారు. ఏ దిక్కు నుంచి చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. కింది అంతస్థులో పదిహేడు ఆర్చ్‌లు కనిపిస్తున్నాయి. అన్ని వైపులా ఇదే కొలతలు, నమూనాతో ఆర్చ్‌లు ఉంటాయి.
బ్రిటిష్ అధికారులు బహదూర్‌షాను అదుపులోకి తీసుకున్న చిత్రం
నాటి తోటల్లేవు
మొఘలుల కాలంలో వేసిన తోటలు ఇప్పుడు లేవు. మామిడి వంటి రకరకాల చెట్లతో తోటల ప్రాముఖ్యత మాత్రం తగ్గకుండా నిర్వహిస్తున్నారు. చారిత్రక నిర్మాణాల మరమ్మత్తు కత్తిమీద సాములాంటి పని. అప్పటి నిపుణుల నిర్మాణ కౌశలానికి భంగం కలగకుండా చేయాల్సి ఉంటుంది. హుమయూన్ సమాధి మరమ్మత్తులు కూడా పలుచటి సిమెంట్ పొరలతో అత్యంత నైపుణ్యంగా చేశారు. తోటల నిర్వహణ కోసం 128 భూగర్భజలాశయాలను కూడా పూడిక తీసి పూర్తి స్థాయిలో పని చేయిస్తున్నారు. ఇది పేరుకు హుమాయూన్ సమాధి నిర్మాణమే కాని, ఇందులో హుమయూన్ సమాధితోపాటు అతడి భార్యలు హాజీ బేగం, హమీదా బేగం సమాధులు, షాజహాన్ కొడుకు దారుషుకో సమాధి, ఇంకా మొఘల్ రాజ ప్రముఖుల సమాధులు కూడా ఉన్నాయి. నిర్మాణం నాటికి ఎవరూ ఊహించని మరో విషయం ఏమిటంటే... మొఘలు పాలనకు సమాధి కూడా ఇక్కడే జరిగింది. మొఘల్ చివరి పాలకుడు బహదూర్ షా అతడి సంతానాన్ని బ్రిటిష్ సైనిక అధికారి స్వాధీనం చేసుకున్నది ఇక్కడే.
చదువరి
ఇంతకీ హుమయూన్ ఎవరనే సందేహం కలిగితే... అందుకు సమాధానం అతడు అక్బర్ తండ్రి. భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్‌కు కొడుకు. సున్నిత మనస్కుడు, బాగా చదువుకున్న వాడు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు నమాజ్ సమయమైందని గుర్తుకు వచ్చి హడావుడిగా లైబ్రరీ మెట్లు దిగుతున్న సమయంలో మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు. తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
అక్బర్ పుట్టే నాటికి రాజ్యం లేదు
హుమయూన్ 23 ఏళ్లకే రాజయ్యాడు. వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని సోదరుల మధ్య విద్వేషాల కారణంగా పదేళ్లకే కోల్పోయాడు. కొన్నేళ్లపాటు కాందిశీకుడిగా గడిపాడు. హుమయూన్ హిందూ రాజులతో స్నేహంగా ఉండేవాడు. గర్భిణి అయిన భార్యను సింధు రాజు సంరక్షణలో ఉంచి యుద్ధానికి సిద్ధం కావడానికి ఎడారులకు వెళ్లిపోయాడు. అక్బర్ పుట్టినప్పుడు వర్తమానం తెచ్చిన వార్తాహరుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని ఆవేదన చెందాడు. బికారిగా కొడుకుకు ముఖం చూపించలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పదిహేనేళ్ల పోరాటం తర్వాత సింహాసనాన్ని 1555 జూలై నెలలో తిరిగి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలలకే 1556, జనవరి నెలలో తుది శ్వాస వదిలాడు.
చదవండి:
దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం..
కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే!