శాతకర్ణికి వంద శాతం పన్ను రాయితీ
పోలవరం సబ్ కాంట్రాక్టర్కు రూ.96 కోట్లు చెల్లింపు
కేబినెట్ భేటీలో నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతుల్లేకుండా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ కల్పించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు విజ్ఞానం, చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా వినోదపు పన్ను రాయితీలను ఇస్తారు. రాయితీ ఇస్తే ఆ మేర టికెట్ ధరలను తగ్గించి విక్రయించాల్సి ఉంది. సినిమా చూసే వారికి రాయితీ వర్తింప చేయాలి తప్ప సినిమా తీసిన వారికి వర్తింపు చేయరాదు. అయితే తొలుత ఈ నెల 9వ తేదీన జారీ చేసిన జీవోలో 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ టికెట్ ధరను నిర్ధారించిన ధరలో 75 శాతానికి మించి వసూలు చేయరాదనే షరతు విధించారు. ఇప్పుడు ఆ షరతును తొలగిస్తూ నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చిత్ర కధానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది అయినందున దీనిపై తన ఒత్తిడేమీ లేదన్నట్లుగా కనిపించేందుకు, నిర్ణయం తీసుకునే సమయంలో మంత్రివర్గ సమావేశం నుంచి సీఎం బయటకు వెళ్లడం గమనార్హం. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు.
హా పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ సబ్ కాంట్రాక్టరైన ఎల్ అండ్ టీకి రూ.38 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్సుగా, రూ.58 కోట్లు యంత్రపరికరాల నిమిత్తం చెల్లింపులు చేయాల్సి ఉంది. ట్రాన్స్ట్రాయ్కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.250 కోట్లు చెల్లించింది. సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలైన ఎల్ అండ్ టీ–జర్మనీ కంపెనీలకు ఆ నిధులనుంచి చెల్లింపులు చేయించకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.96 కోట్లు ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్విస్ చాలెంజ్ విధానంలో స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఏడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి స్మార్ట్ సిటీ నిర్మాణం చేపడతాయి.హా నెల్లూరు కేంద్రంగా 1644.17 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నెల్లూరు పట్టణాభివృద్ధి అధారిటీ ఏర్పాటు చేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతి మంజూరు చేస్తూ ఆమోదం.