వ్యాలీ నిపుణులకు.. ఇన్ఫోసిస్ ఎర
బెంగళూరు : భారత రెండో అతిపెద్ద సాప్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ భవిష్యత్ పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. కంపెనీ కొత్తగా చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫాం 'మన' ను విజయవంతం చేయడానికి, ఉత్పత్తులను అభివృద్ధి చేయడం కోసం ప్రపంచంలో టెక్ దిగ్గజాల పుట్టినిల్లు సిలికాన్ వ్యాలీ నిపుణులను ఇన్ ఛార్జ్ లుగా నియమించుకోవాలనుకుంటోంది. సిలికాన్ వ్యాలీలో కంపెనీ ప్రొడక్ట్ లను, ప్లాట్ ఫాం టీమ్ లను పెంచుకునేందుకు చూస్తున్నామని ఇన్ఫోసిస్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ అధినేత నవీన్ బుదిరాజా తెలిపారు.
ఎక్స్ పర్ట్ ట్రాకింగ్ ప్రొగ్రామ్ ద్వారా ప్రత్యేక సూపర్ కోడర్స్ టీమ్ ను రెండింతలు చేసుకున్నామని వెల్లడించారు. ఈ టీమ్ ను మరింత పెంచుకోనున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త ప్రాంతాల్లో టెక్నాలజీని అభివృద్ధిచేసి, రెవెన్యూలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.
కంపెనీ క్లౌడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అధినేత శామ్ సన్ డేవిడ్ ను ఎక్స్ పర్ట్ సర్వీసుల టీమ్ కు అధినేతగా నియమించినట్టు తెలిపారు. ఇన్ఫోసిస్ కొత్తగా చేపట్టిన సాప్ట్ వేర్ ప్లాట్ ఫాం 'మన' లాంటి వాటిని విజయవంతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని కంపెనీ ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంపెనీలో నెలకొన్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. బిగ్ డేటా ప్లాట్ ఫాం, ఆటోమేషన్ ప్లాట్ ఫాం, మేథస్సు చుట్టూ తాము చేస్తున్న పనిని 'మన' ప్రొగ్రామ్ ఓ ఉన్నతస్థితికి తెస్తుందని ఆశించారు.