305 నగరాల్లో ‘అందరికీ ఇళ్లు’
తొమ్మిది రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
* జాబితాలో తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలకు చోటు
న్యూఢిల్లీ: పట్టణ పేదల కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ‘అందరికీ ఇళ్లు’ను అమలు చేసేందుకు దేశంలోని 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది. తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలు వీటిలో ఉన్నాయి. త్వరలోనే ఈ నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన(హెచ్‌యూపీఏ) శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
వచ్చే ఆరేళ్ల వ్యవధిలో రెండు కోట్ల మంది పట్టణ పేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు హెచ్‌యూపీఏ మంత్రిత్వ శాఖ రూ. 2 లక్షల కోట్లను వ్యయం చేయనుంది. ఈ పథకానికి తెలంగాణలోని 34 పట్టణాలు, నగరాలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 36, గుజరాత్ 30, జమ్మూకశ్మీర్ 19, జార్ఖండ్ 15, కేరళ 15, మధ్యప్రదేశ్ 74, ఒడిశా 42, రాజస్థాన్ నుంచి 40 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది.
ప్రస్తుతం ఎంపిక చేసిన 9 రాష్ట్రాలతో పాటు మరో ఆరు రాష్ట్రాలు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఆరు తప్పనిసరి సంస్కరణలు అమలు కోసం హెచ్‌యూపీఏతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, బిహార్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఒప్పందం ప్రకారం లేఅవుట్ ప్రతిపాదనలు, నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో ద్వారా నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతులు ఇవ్వాలి.
ఆర్థికంగా వెనుకబడిన, అల్పా దాయ వర్గాల ఇళ్ల నిర్మాణానికి తక్కువ నిర్మాణ ప్రాంతంలోనూ నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. అద్దె చట్టాలకు హెచ్‌యూపీఏ సూచించిన మార్పులు చేయాలి. తక్కువ వ్యయ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు, మురికివాడలను అభివృద్ధికి సాంద్రత నిబంధనల సరళీకరణ వంటి సవరణలు చేయాలి. పట్టణ ఇళ్ల నిర్మాణ మిషన్‌లో భాగంగా కేంద్రం ఒక్కో యూనిట్‌కు రూ. లక్ష నుంచి రూ. 2.3 లక్షలను సహాయంగా అందజేస్తుంది.