మక్కాలో నగర హజ్ యాత్రికురాలు మృతి
హైదరాబాద్: హైదరబాద్కి చెందిన హజ్ యాత్రికురాలు హుర్మతున్నీసా మక్కాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నగరంలోని ఆసీఫ్ నగర్ లోని ఎస్బీహెచ్ కాలనీలో నివాసముండే హుర్మతున్నీసా గత ఆగస్టు 23న భర్త ముహమ్మద్ గౌస్‌తో కలిసి హజ్‌యాత్ర కోసం మక్కాకు వెళ్లారు. ఈ నెల 11న నగరానికి తిరిగి రావాల్సి ఉంది.
హజ్ ముగిసిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చికిత్సకోసం మక్కాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో ముస్లిం సంప్రదాయంప్రకారం ఆమె మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ అహమ్మద్ సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి భర్త మహమ్మద్ గౌస్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత రాయబారికి ఫోన్లో విజ్ఞప్తి చేశారు.