పెళ్లి చేసుకున్నాడు..పొమ్మంటున్నాడు
మదనపల్లె క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకుని 5 నెలల కాపురం తర్వాత కాదు పొమ్మంటున్నాడని ఒక వివాహిత మంగళవారం రూరల్ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరిట ఉన్న డబ్బు, నగలు మొత్తం అతనికే ఇచ్చేశానని, న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె కథనం మేరకు.. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన వెంకట్రమణ కుమార్తె గంగాదేవి(25) వికలాంగురాలు. మూడేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పనిచేస్తోంది. ఇదే కంపెనీలో పలమనేరు మండలం జీడిమెట్లకు చెందిన రెడ్డెప్పరెడ్డి పనిచేసేవాడు.
ఇద్దరికి పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. రెడ్డెప్పరెడ్డి మాయమాటలకు పడిపోయిన గంగాదేవి తల్లిదండ్రులు తన పేర బ్యాంకులో డిపాజిట్ చేసిన 2లక్షలను అతనికే ఇచ్చేసింది. ప్రతినెలా జీతం కింద వచ్చే రూ.10వేలను అతనికే ఇచ్చేది. ఈ క్రమంలో ఇద్దరు ఈ ఏడాది జూన్ 18న చిప్పిలిలోని దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గంగాదేవి ఇంటివద్దే కాపురం పెట్టారు. తర్వాత రెడ్డెప్పరెడ్డి భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ రెండు నెలలు కాపురం ఉన్నారు. తర్వాత ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన భర్త రెడ్డెప్పరెడ్డి, అతని భాస్కర్‌రెడ్డి, అమ్మ పద్మమ్మ పథకం ప్రకారం కొడుకు, కోడలిని నెల రోజుల క్రితం అత్తారింటికి పంపారు. రెండు రోజులు అక్కడే ఉన్న రెడ్డెప్పరెడ్డి పనిమీద బెంగళూరుకు వెళుతున్నానని చెప్పి భార్యను అక్కడే వదిలి వెళ్లిపోయాడు.
రెండు మూడు వారాలు గడిచినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. గంగాదేవి అత్త పద్మమ్మ, బావ భాస్కర్‌రెడ్డికి ఫోన్‌చేస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. మోసపోయానని తెలుసుకున్న గంగాదేవి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఉన్నదంతా భర్తకే ఊడ్చిపెట్టానని, వికలాంగురాలినని, న్యాయం చేయాలని వేడుకుంది.