భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
చింతలపూడి, న్యూస్‌లైన్ : చింతలపూడి శివాలయం సమీపంలోని బావిలో తోట రమేష్ (24) అనే వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ తన భార్య సత్యవతితో శుక్రవారం ఘర్షణ పడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నా రు. ఆదివారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలోని నూతిలో రమేష్ మృతదేహం కనిపించింది. నూతి పక్కన మృతుడి సైకిల్, చెప్పులు పడి ఉన్నాయి. రమేష్ స్థానిక ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతను తాగి వచ్చి తరచూ వేధిస్తున్నాడని భార్య అలిగి పుట్టిం టికి వెళ్ళి పోయింది.
బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఇటీవల కాపురానికి పంపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసు కుమారుడు ఉన్నాడు. తాగుడు మాని మారతాడనుకున్న భర్త తమను అన్యాయం చేసి వెళ్లిపోయాడని సత్యవతి రోదిస్తూ చెప్పింది. చంటి బిడ్డతో ఎలా బతకాలని వాపోయింది. రమేష్ మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చింతలపూడి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టంకు తరలించారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.