రైతులకు ‘జీఎస్టీ’ మినహాయింపు
చిన్న వ్యాపారులకు కూడా..
► చిన్న హోటళ్లపై 5 శాతం పన్ను
► జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం.. మద్దతు బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధి నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కోసం కీలక మద్దతు బిల్లులైన సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ)ల తుది ముసాయిదాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ‘వ్యవసాయదారులు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరం లేదు.
ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఈశాన్య భారతం, కొండ ప్రాంత రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ. 10 లక్షలుగా ఉంటుంది. అయితే ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)లో చేరొచ్చు’ అని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 50 లక్షల టర్నోవర్ లోపున్న వ్యాపార సంస్థలు.. తక్కువ పన్ను చెల్లించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ కాంపొజిషన్ స్కీంను వినియోగించుకోవచ్చని పేర్కొంది. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై విధించాల్సిన జీఎస్టీని కౌన్సిల్ 5 శాతంగా(కేంద్రం 2.5 శాతం, రాష్ట్రం 2.5 శాతం) నిర్ణయించింది. రూ. 50 లక్షలు దాటిన రెస్టారెంట్లు రెగ్యులర్ సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హుస్ముఖ్ అధియా చెప్పారు.
బడ్జెట్ మలి విడత సమావేశాల్లో..
స్టేట్ జీఎస్టీ(ఎస్జీఎస్టీ), యూనియన్ టెరిటరీ జీఎస్టీ(యూటీజీఎస్టీ) బిల్లులను ఈ నెల 16న జరిగే భేటీలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించి ఆమోదిస్తుందని జైట్లీ తెలిపారు. జీఎస్టీ ముసాయిదా చట్టంలో 40 శాతం వరకు పన్ను(కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం) విధించాలన్న నిబంధన ఉంటుందని, అయితే అమల్లోకి వచ్చే సగటు పన్ను రేట్లు గతంలో ఆమోదించిన 5, 12, 18, 28 శాతాలుగానే ఉంటాయన్నారు. ‘రేట్లు కౌన్సిల్ నిర్ణయించినట్లే ఉంటాయి.
అయితే కస్టమ్స్ చట్టంలో మాదిరి పన్ను విధింపునకు అవకాశం కోసం పన్ను పరిమితి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొన్ని వస్తువులు, సరుకులపై పన్ను పెంచితే పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం ఉండదు’ అని వివరించారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను 9 నుంచి మొదలయ్యే బడ్జెట్ మలి విడత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం కోసం ప్రవేశపెడతామని, జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను కౌన్సిల్ ఆమోదించాక.. రాష్ట్రాల నష్టపరిహార బిల్లు, సీజీఎస్టీ, యూటీజీఎస్టీ, ఐజీఎస్టీలను కేబినెట్ ఆమోదిస్తుందని, తర్వాత అవి పార్లమెంటు ముందుకు, ఎస్జీఎస్టీ రాష్ట్రాల చట్టసభలకు వెళ్తాయని వివరించారు.
కౌన్సిల్ మరికొన్ని నిర్ణయాలు
♦ పన్నుచెల్లింపుదారు పన్నులు వాయిదాల్లో కట్టేందుకు అనుమతించే అధికారాన్ని కమిషనర్ స్థాయి అధికారులకు కల్పించడం
♦ ఎగుమతిదారులు చెల్లించిన పన్నులో వారికి రీఫండ్ చేయాల్సిన మొత్తంలో 90 శాతాన్ని దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లో చెల్లించడం
♦ పన్ను రిటర్న్, పన్ను చెల్లింపు, ఇతర వ్యవహారాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రిజిస్ట్రేషన్
♦ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ– తయారీదారులు చెల్లించిన పన్ను)లో రీఫండ్ మొత్తాలను ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల్లో దేన్నైనా చెల్లించడానికైనా వాడుకునే అవకాశం